భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సన్నద్ధం

by Thanuru Gopichand |

ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా రూపాంతరం చెందనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సన్నద్ధం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా రూపాంతరం చెందనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం రేపటికి బలపడనున్నట్లు తెలిపారు. ఎల్లుండికి నైరుతిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావం వల్ల నేడు కోనసీమ, కృష్ణా,బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఈ క్రమంలో ప్రజలకు ఆపద రాకుండా ఉండడానికి, వర్షాల కారణంగా కలిగే నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి ఏపీ ప్రభుత్వం సన్నద్ధం అయ్యింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శనంలో హోం మంత్రి వంగలపూడి అనిత (Anitha Vangalapudi) విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో సమీక్షను నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి అధికారులతో చర్చించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బలగాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప మూడు రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రావొద్దని హోం మంత్రి కోరారు. అత్యవసర సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 లలో సంప్రదించాలని సూచించారు.

Next Story