- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే వేటే.. 51 మంది వైద్యులపై ఉక్కుపాదం
విధుల్లో అలసత్వం వహించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో విధులు నిర్వర్తించకుండా, అనుమతి లేకుండా అనధికారికంగా సెలవుల్లో ఉంటున్న వైద్యులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వైద్యుల బాధ్యతారాహిత్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, నిబంధనలు ఉల్లంఘించిన 51 మంది వైద్యులను సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా విధులకు గైర్హాజరవుతున్న వారిపై శాఖాపరమైన విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. సస్పెండ్ చేసినవారిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు.
వీరితో పాటు మరో ముగ్గురు ప్రొఫెసర్లపైనా త్వరలోనే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే విధుల్లో అలసత్వం వహించిన మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో వైద్యుల నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని మంత్రి స్పష్టం చేశారు. జీతాలు తీసుకుంటూ విధులకు రాకుండా ఉండటం లేదా సొంత క్లినిక్కులకే ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులోనూ వైద్యుల బయోమెట్రిక్ హాజరు, పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ వైద్య రంగంలో జవాబుదారీతనం పెరుగుతుందని ఆరోగ్య శాఖ వర్గాలు భావిస్తున్నాయి.






