- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎండలో బయటకు వెళ్తున్నారా..: ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనట..?
ఆంధ్రప్రదేశ్‌లో క్రమేపి పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు..

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో క్రమేపి పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. గురువారం నంద్యాల జిల్లా సంజామలలో గరిష్ఠంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 215 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. శుక్రవారం (ఏప్రిల్ 17) మన్యం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠంగా 43 నుంచి 44.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. 30 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 55 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఉండనుందని తెలిపారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లోని మొత్తం 55 మండలాల్లో వడగాలులు వీచనున్నాయని చెప్పారు.
తగిన జాగ్రత్తలు తీసుకోవాలి...
శనివారం మూడు మండలాల్లో తీవ్ర వడగాలులు, 28 మండలాల్లో వడగాలులు ఉండే అవకాశం ఉందన్నారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని సూచించారు. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలని, చెవుల్లోకి వేడి గాలి చేరకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రఖర్ జైన్ సూచించారు.






