- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. ఎడారిలో చుక్క తాగు నీరు లేక 49 మంది మృతి
సహారా ఎడారి మృత్యుకుహరంగా మారింది. పండుగ సంబరాలు ముగించుకుని సంతోషంగా ఇళ్లకు తిరిగి వస్తున్న కుటుంబాల్లో ఎడారి ఒక్కసారిగా తీరని విషాదాన్ని నింపింది.

దిశ, వెబ్ డెస్క్ : సహారా ఎడారి (Sahara Desert) మృత్యుకుహరంగా మారింది. పండుగ సంబరాలు ముగించుకుని సంతోషంగా ఇళ్లకు తిరిగి వస్తున్న కుటుంబాల్లో ఎడారి ఒక్కసారిగా తీరని విషాదాన్ని నింపింది. నైజర్ (Niger) దేశం పరిధిలోని సహారా ఎడారి మారుమూల ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఒక లారీ అర్ధాంతరంగా బ్రేక్‌డౌన్ అవ్వడంతో.. తీవ్రమైన ఎండలు, దానికి తోడు తాగడానికి బొట్టు నీరు కూడా దొరకని భయానక పరిస్థితుల మధ్య చిక్కుకుని ఏకంగా 49 మంది వలసదారులు, ప్రయాణికులు దాహంతో అల్లాడి ప్రాణాలు కోల్పోయారు. జూన్ 4న ఉత్తర నైజర్‌లోని సరిహద్దు పట్టణమైన అస్సామాకా(Assamaka)కు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్జన ఎడారి ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. మాలీ (Mali) దేశంలో జరిగిన పవిత్ర ముస్లిం పండుగ ఈద్(Eid) వేడుకలకు హాజరై, తిరిగి వస్తున్న ప్రయాణికులతో నిండిన ఒక లారీ అస్సామాకా వైపు వస్తుండగా ఎడారి మధ్యలో బ్రేక్ డౌన్ తో నిలిచిపోయింది. చుట్టూ మైళ్ల దూరం వరకు ఇసుక తిన్నెలు తప్ప మనుషుల ఆనవాళ్లు లేని ఆ తీవ్రమైన ఉష్ణోగ్రతల్లో, వారి వద్ద ఉన్న తాగునీటి నిల్వలు పూర్తిగా అయిపోయాయి. చుట్టుపక్కల కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి నివాసాలు, నీటి సదుపాయాలు లేక అగ్నిగుండంలా మారిన ఎడారి వేడిని తట్టుకోలేక ఒకరి తర్వాత ఒకరు దాహార్తితో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ ప్రమాదం నుండి కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారు.
వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి, ఎండ తీవ్రతను తట్టుకుంటూ దాదాపు 50 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించి ఎట్టకేలకు ఒక సురక్షిత ప్రాంతానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. సజీవంగా బయటపడిన వారి ద్వారా సమాచారం అందుకున్న నైజర్ రెస్క్యూ టీమ్స్, భద్రతా దళాలు అత్యవసరంగా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే అప్పటికే లారీ పరిసరాల్లో 49 మంది ప్రాణాలు విడిచి పడి ఉండటాన్ని చూసి అధికారులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎడారిలో మృతదేహాలు మరింతగా పాడైపోయే అవకాశం ఉండటంతో, నిబంధనల ప్రకారం అధికారుల సమక్షంలోనే వారందరినీ ఒకేచోట ఖననం చేశారు.






