పంచాయితీలే దేశ నిర్మాణానికి పునాదులు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

by Ajay Maddhiboyina |

గ్రామీణ ఆంధ్రప్రదేశ్ బలోపేతం దేశానికి అవసరమని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు.

పంచాయితీలే దేశ నిర్మాణానికి పునాదులు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: గ్రామీణ ఆంధ్రప్రదేశ్ బలోపేతం దేశానికి అవసరమని డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. వికసిత్ భారత్ అనే మహా లక్ష్యంలో గ్రామీణాంధ్ర ప్రదేశ్ కీలకం అని చెప్పారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ప‌వ‌న్ పాల్గొన్నారు. సమావేశంలో 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ డా.అరవింద్ పనగరియా, ఇతర సభ్యులు సీఎం చంద్రబాబు, మంత్రులు ఉన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ పక్షాన తొమ్మిది అంశాలతో కూడిన ప్రతిపాదనలను ఆర్థిక సంఘం ముందు ఉంచారు.

స‌మావేశంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ... పంచాయతీల స్వయం ప్రతిపత్తి సాధన లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముందుకు వెళ్తోందని స్ప‌ష్టం చేశారు. గ్రామాల సమగ్రాభివృద్ధి ద్వారా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం, వలసలు అరికట్టడం, ఆహార భద్రత వంటి లక్ష్యాల సాధన సాధ్యపడుతుందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతంలో ఆర్థిక సంఘం సహకారం ఎంతో అవసరమన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పర్యావరణహితంగా, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఆర్థిక సంఘం సహాయ సహకారాలతో పని చేస్తామని అన్నారు.

పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తామంతా కంకణబద్దులై ఉన్నట్టు తెలిపారు. సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో ప్రభుత్వ లక్ష్య సాధనకు 16వ ఆర్థిక సంఘం పూర్తి స్థాయిలో సహకరిస్తుంద‌ని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పని చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ఉమ్మడిగా పని చేయడం బరువు కాదని, బాధ్యతగా భావిస్తున్న‌ట్టు తెలిపారు. ప్ర‌తిగ్రామాన్ని డిజిటల్ పంచాయితీగా అభివృద్ధి చేసే లక్ష్యంతో వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయనున్నామ‌ని చెప్పారు. పంచాయతీలే దేశ నిర్మాణానికి పునాదులు అని నమ్ముతున్నామని అన్నారు.

Next Story