రాజధాని రైతు సమస్యల పరిష్కారానికి ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం

by Thanuru Gopichand |

రాజధాని ప్రాంత రైతుల (Amaravati Farmers) సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

రాజధాని రైతు సమస్యల పరిష్కారానికి ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ :​ రాజధాని ప్రాంత రైతుల (Amaravati Farmers) సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సీఆర్డీఏ కార్యాలయంలో రైతుల నుంచి ప్రతి రోజూ ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు వివరాలను వెల్లడించారు. రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్‌‌లో ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతులు తమ అర్జీలను సమర్పించవచ్చని తెలిపారు. భూముల కేటాయింపు, లేఅవుట్ అభివృద్ధి, సరిహద్దుల వివాదాలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్, పెండింగ్‌లో ఉన్న వార్షిక చెల్లింపులు వంటి అనేక అంశాలపై రైతులు తమ అభ్యంతరాలను, సమస్యలను అధికారులు దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఈ నిర్ణయం అమరావతి రైతుల ఆందోళనలను తగ్గించి, ప్రభుత్వంతో మరింత పారదర్శకమైన, నిరంతర సంభాషణకు మార్గం సుగమం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.

​గతంలో నెలవారీ లేదా వారానికి ఒక రోజు మాత్రమే ఫిర్యాదుల స్వీకరణ జరిగేది. అయితే, ప్రస్తుత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, రైతు సమస్యలను సానుకూల దృక్పథంతో మరియు నిర్దేశిత కాలపరిమితిలో పరిష్కరించాలనే ఉద్దేశంతో సీఆర్డీఏ ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. రైతుల డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని, ప్లాట్ల బౌండరీ స్టోన్‌లను ఏర్పాటు చేయాలని, అలాగే ల్యాండ్‌ పూలింగ్‌లో పెండింగ్‌లో ఉన్న గ్రామ కంఠాలు, జరీబు భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాజధాని రైతులతో ఇప్పటికే అనేకసార్లు కమిషనర్ కన్నబాబు, ఇతర అధికారులు సమావేశమై చర్చించారు. రైతుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడానికి, రాజధాని పనులను పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లడానికి ఈ రోజూవారీ గ్రీవెన్స్ విధానం ఎంతో ఉపకరిస్తుందని కమిషనర్ కన్నబాబు స్పష్టం చేశారు.

Next Story