శంషాబాద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు..కారణం ఇదే..!

by Vemula.Srinu Prasad |

ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో పర్యటించనున్నారు..

శంషాబాద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు..కారణం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్(Shamshabad) మండలంలో పర్యటించనున్నారు. కన్హా శాంతివనాన్ని(Kanha Shanti Vanam) ఆయన సోమవారం సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు జూబ్లిహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి బయల్దేరి కన్హా శాంతివనం చేరుకుంటారు. ఆశ్రమం అధ్యక్షులు కమలేష్ డి.పటేల్ దాజీతో సమావేశం నిర్వహిస్తారు. రెండు గంటల పాటు శాంతివనంలోని వెల్ నెస్, మెడిటేషన్ సెంటర్ సహా యోగా కేంద్రాలను ఆయన పరిశీలిస్తారు. ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్ కేంద్రం, మెడిటేషన్ సెంటర్, బయోచార్ కేంద్రం, పుల్లెల గోపీచంద్ స్టేడియంతో పాటు హార్టిఫుల్ నెస్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను చంద్రబాబు నాయుడు సందర్శిస్తారు. ఆ తర్వాత శాంతివనం వ్యవస్థాపకుడు దాజీ నివాసానికి వెళ్తారు.

కాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మొత్తం 1400 ఎకరాల్లో కన్హా శాంతివనాన్ని శ్రీరామచంద్ర మిషన్ అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్‌ను ఈ ఆశ్రమం కలిగి ఉంది. 8 లక్షలకు పైగా వివిధ జాతుల వృక్షాలతో బయోడైవర్సిటీ కేంద్రంగా ఈ ఆశ్రమం పెద్దఎత్తున పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. మానవ వనరుల్ని గ్లోబల్ లీడర్లుగా తయారు చేసేందుకు ఈ ఆశ్రమం అధ్యక్షుడు దాజీ నేతృత్వంలో హార్ట్ ఫుల్ నెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ నిర్వహిస్తోంది. కౌశలం పేరిట శిక్షణా కార్యక్రమాలను చేపడుతోంది. కన్హా శాంతివనంలోని యోగా, మెడిటేషన్, వెల్ నెస్ సెంటర్లతో పాటు సుస్థిర వ్యవసాయ క్షేత్రాన్ని సైతం సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. అనంతరం ఆయన హెలికాప్టర్లో బయల్దేరి అమరావతికి తిరిగి చేరుకుంటారు. సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో అధికారులతో వేర్వేరుగా సమీక్షా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్రప్రభుత్వం నిర్వహించనున్నా అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణదినం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు.

Next Story