ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (AP Capital Amaravati)లో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన భూముల సమీకరణకు మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (AP Capital Amaravati)లో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన భూముల సమీకరణకు మంత్రివర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి నూతన నిబంధనలు రూపొందించినట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu Pardhasaradhi) తెలిపారు. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

న్యాయస్థానాల ఆదేశాలను అనుసరిస్తూ నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అసైన్డ్‌, దేవాదాయ భూములపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో దర్యాప్తు చేసి, భూసర్వేలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతుల కోసం ఉచిత విద్య, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

గతంలో ప్రారంభించి నిలిచిపోయిన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న జీఏడీ, హెచ్‌వోడీ భవన నిర్మాణ బాధ్యతలు ఎన్‌సీసీ, ఎల్ అండ్ టీ, షాపూర్ పల్లోంజీ సంస్థలకు అప్పగించనున్నట్లు తెలిపారు. కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం లభించిందని పేర్కొన్నారు.

రోడ్డు అనుసంధానానికి రూ.682 కోట్ల అనుమతి

ఈ రోడ్డును జాతీయ రహదారి 16తో అనుసంధానించేందుకు రూ.682 కోట్ల విలువైన టెండర్లకు పరిపాలన అనుమతి మంజూరైంది. దీనితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఇతర ముఖ్యమైన నిర్ణయాలు

పురపాలక శాఖలో 40 బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల అప్‌గ్రేడ్

మరో 9 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఆమోదం

భవన నిర్మాణ చట్ట నిబంధనల సరళీకరణ

టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం

తిరుపతిలో 12 ఎకరాల భూమిని పర్యాటక శాఖకు బదిలీ

గండికోట వద్ద రిసార్టుల కోసం 50 ఎకరాల భూమి కేటాయింపు

శ్రీశైలం డ్యామ్, కాటన్ బ్యారేజీల భద్రత కోసం రూ.350 కోట్లు

పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్‌కు కేబినెట్ ఆమోదం

పెట్టుబడులకు భారీ ప్రోత్సాహం

SIPB సమావేశంలో తీసుకున్న పెట్టుబడి నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖపట్నం మధురవాడలో కాగ్నిజెంట్ సంస్థ ఏర్పాటు కోసం 22.19 ఎకరాలు కేటాయించగా, ఈ ప్రాజెక్టు ద్వారా రూ.1,582 కోట్ల పెట్టుబడి రానుందని అంచనా.

అంగన్వాడీల అప్‌గ్రేడ్, పొగాకు కొనుగోలు

రాష్ట్రవ్యాప్తంగా 4,687 మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తారు. పొగాకు కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్‌కు రూ.273.17 కోట్లు మంజూరు చేశారు. వచ్చే ఏడాది పొగాకు సాగుకు క్రాప్ హాలిడే ప్రకటించాలని కేబినెట్ తీర్మానించింది.

సాంస్కృతిక విభాగానికి అంబేద్కర్ విగ్రహ నిర్వహణ

విజయవాడ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణ నిర్వహణ బాధ్యతలను సాంఘిక సంక్షేమ శాఖ నుంచి సాంస్కృతిక విభాగానికి బదిలీ చేశారు. పెండింగ్ పనులను నిధులు కేటాయించి పూర్తిచేయాలని నిర్ణయించారు.

Next Story