- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP Budget: కనకదుర్గమ్మ పాదాల చెంత ఏపీ బడ్జెట్ ప్రతులు.. ఆర్థిక మంత్రి కేశవ్‌కు అందజేత
ఏపీ బడ్జెట్ 2026-27ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు, విజయవాడ కనకదుర్గమ్మ పాదాల చెంత బడ్జెట్ ప్రతులను ఉంచి ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన ఈ బడ్జెట్‌కు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ క్రతువు నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక గమనాన్ని నిర్దేశించే 2026-27 ఆర్థిక సంవత్సర పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని, ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రజలందరికీ మేలు చేకూర్చాలని ఆకాంక్షిస్తూ ఆర్థిక శాఖ అధికారులు విజయవాడ ఇంద్రకీలాద్రి (Indrakeeladri)పై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి పాదాల చెంత బడ్జెట్ ప్రతులను ఉంచి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అధికారులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి, బడ్జెట్ విజయవంతం కావాలని ఆశీర్వదించారు. అనంతరం ఆ బడ్జెట్ ప్రతులను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్‌కు అందజేశారు.
కాగా, ఈ ఏడాది బడ్జెట్ సుమారు రూ. 3.46 లక్షల కోట్ల నుంచి రూ. 3.50 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సరిగ్గా ఉదయం 10.30కి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగబోయే కేబినెట్ భేటీలో 2026-27 వార్షిక బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనున్నారు.






