వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది : స్పీకర్ అయ్యన్నపాత్రుడు

by Naga Rani Yarlagadda |

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమయిందని, జగన్ కు అధికారమే తెలుసు తప్ప.. పరిపాలన గురించి తెలియదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు విమర్శలు చేశారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది : స్పీకర్ అయ్యన్నపాత్రుడు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనమయిందని, జగన్ కు అధికారమే తెలుసు తప్ప.. పరిపాలన గురించి తెలియదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు విమర్శలు చేశారు. సోమవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తిలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో 41 రోజులపాటు నిర్వహిస్తోన్న మహాకోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, రుద్రయాగ, చండీయాగ, నవగ్రహ యాగాల్లో అయ్యన్న పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. గత పాలకులది రాక్షస పాలన అంటూ మండిపడ్డారు. పూర్వకాలంలో రాజ్యాన్ని, రాజ్యంలోని ప్రజలను రాక్షసుల బారి నుంచి కాపాడుకునేందుకు రాజులు యాగాలు చేసేవారని, ఏపీలోనూ గత వైసీపీ పాలన అదేవిధంగా ఉందని దుయ్యబట్టారు.

వైసీపీ నేతలు తమ మూర్ఖత్వంతో ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశారని, రాష్ట్ర ఖజానాని దోచుకుని అప్పులు మిగిల్చారన్నారు. దుర్మార్గులు, రాజకీయాలంటే అర్థం తెలియని వారు రాష్ట్రాన్ని పాలించడం దురదృష్టకరమన్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ప్రజలు కూటమికి పట్టం కట్టి రాష్ట్రాన్ని కాపాడుకున్నారన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంటే వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారన్నారు. ఇప్పుడు జగన్ కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనని, ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఎమ్మెల్యేకు ఇచ్చే సమయమే ఇస్తామని స్పష్టం చేశారు. కానీ.. తనను అధ్యక్షా అని పిలిచి మాట్లాడటం ఇష్టం లేకే జగన్ అసెంబ్లీకి రావడం లేదన్నారు.

Next Story