AP Assembly: ప్రభుత్వ మార్పుతో రాష్ట్ర పురోగతికి విఘాతం.. గవర్నర్ అబ్దుల్ నజీర్ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-11 05:27:10  IST  )

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి.

AP Assembly: ప్రభుత్వ మార్పుతో రాష్ట్ర పురోగతికి విఘాతం.. గవర్నర్ అబ్దుల్ నజీర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎన్నో సవాళ్లను తట్టుకుని నిలబడగలిగిందని కితాబిచ్చారు.

2019 తర్వాత వ్యవస్థాగత పాలనా వైఫల్యాలు..

దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ గతంలో (2014-19) అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. 2019లో జరిగిన ప్రభుత్వ మార్పు ఈ పురోగతికి విఘాతం కలిగించిందని వ్యాఖ్యానించారు. 2019 తర్వాత వ్యవస్థాగత పాలనా వైఫల్యాలు తలెత్తాయని అన్నారు. దీంతో రాష్ట్ర అభివృద్ధి స్తంభించిందని, ఆర్థిక ఒత్తిడి తీవ్రమై వ్యవస్థలు పూర్తిగా విధ్వంసమయ్యాయని గవర్నర్ పేర్కొన్నారు.

ప్రగతిపథం వైపు ప్రయాణం..

2019 తర్వాత రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, విద్యుత్, సాగునీటిపారుదల రంగాలు తీవ్ర తిరోగమనం చెందాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. చేదు అనుభవాలతో విసిగివేసారిన ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తెలిపారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతిపథం వైపు పయనిస్తోందని అన్నారు. సూపర్-6 ఇతర సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. ప్రస్తుతం అభివృద్ధి కార్యకలాపాలను పునఃప్రారంభించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని గవర్నర్ తెలిపారు. రాష్ట్రానికి జీవధార అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వేగంగా పనులు చేస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు.

రూ.308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యం..

విధానాలు, వ్యవస్థలు, వ్యయ ప్రాధాన్యతలలో కీలక సవరణలు చేశామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. దీర్ఘకాలిక దార్శనికతతో కూడిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను సమర్పించామని తెలిపారు. 7 శ్వేతపత్రాల విడుదల ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశామని అన్నారు. సంక్షేమాన్ని అభివృద్ధితో సమతుల్యం చేయడానికి 10 సూత్రాలు రూపొందించామని స్పష్టం చేశారు. సంపదను సృష్టించే ప్రగతి చక్రాన్ని నిర్మించడమే కాకుండా పది సూత్రాల లక్ష్యాన్ని పెట్టుకున్నామని అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ ఒక స్పష్టమైన ఆర్థిక మార్గాన్ని నిర్దేశించిందని తెలిపారు. 2047 నాటికి రూ.308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణంతో పాటు రూ.55 లక్షల తలసరి ఆదాయం సాధించడమే లక్ష్యమని అన్నారు.

బలహీన వర్గాలు మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత కోసం డిజిటల్ విధానాన్ని ప్రారంభించామని గవర్నర్ తెలిపారు. పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 205 అన్న క్యాంటీన్లను నిర్వహిస్తున్నామని, త్వరలోనే మరిన్ని క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ‘స్వర్ణాంధ్ర 2047 విజన్’ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఇళ్లు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, గిరిజన మైనార్టీ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ఆర్థిక వృద్ధి, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఏపీని ఐటీ హబ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తూనే యువతకు పెద్దపీట వేస్తూ ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించామని గవర్నర్ వివరించారు. విద్యారంగంలో భాగంగా టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నామని, జాతీయస్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పేదల వైద్యం కోసం యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య భరోసా కల్పిస్తామని, ‘తల్లికి వందనం’ పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని చెప్పారు. చివరగా, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్యాలు లేని (Drugs Free State) రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు గవర్నర్ ప్రకటించారు.

రాష్ట్రంలో నిరంతర అధిక వృద్ధి రేటుపై దృష్టి సారించామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లక్ష్యాలను సవరించుకుంటున్నామని పేర్కొన్నారు. క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో ఏపీ అడుగులు వేయడం ఆనందదాయకమని గవర్నర్ కొనియాడారు.

AP Assembly : గవర్నర్ ప్రసంగం బాయ్‌కాట్.. వైసీపీ వాకౌట్

Next Story