అధికార - విపక్షాల మధ్య మాటల యుద్ధం.. ఏపీ అసెంబ్లీ, మండలి రేపటికి వాయిదా

by Naga Rani Yarlagadda |

ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగ్గా.. మండలిలో మాత్రం అధికార - విపక్షాల మధ్య ఆరంభం నుంచి మాటలయుద్ధం జరిగింది.

అధికార - విపక్షాల మధ్య మాటల యుద్ధం.. ఏపీ అసెంబ్లీ, మండలి రేపటికి వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: రెండోరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగ్గా.. మండలిలో మాత్రం అధికార - విపక్షాల మధ్య ఆరంభం నుంచి మాటలయుద్ధం జరిగింది. మండలి ప్రశ్నత్తరాల్లో ఐటీ కంపెనీలకు విశాఖ భూములను తక్కువకే కేటాయించడంపై వైసీపీ సభ్యులు రచ్చ చేశారు. ఉద్యోగాల కల్పన కోసం భూముల్ని తక్కువకే లీజుకిచ్చామని మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు చెప్తున్నా .. అధికార పార్టీ నిర్ణయాలను వైసీపీ ఎమ్మెల్సీలు తప్పుపట్టారు. విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టారంటూ మండలి నుంచి వాకౌట్ చేశారు. కాసేపటికి మళ్లీ సభలోకి రాగా.. సభా సంప్రదాయాలను పాటించాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు సూచించారు. దీంతో మళ్లీ వాగ్వాదం చెలరేగింది. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపైనా పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి.

నిన్నటి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని బలపరుస్తూ ప్రభుత్వ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మండలిలో ప్రసంగించారు. గతప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి దాడులు నిత్యకృత్యంగా మారాయన్నారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు అన్ని వర్గాల ప్రజలపై వేధింపులకు పాల్పడ్డారని, దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ల్యాండ్, శాండ్, మైనింగ్ మాఫియాలు విచ్చలవిడిగా పెరిగాయన్నారు. కూటమి హయాంలో తప్పు చేసిందెవరైనా తాటతీస్తున్నామని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి, అర్హులకు ఆర్థికసహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. గవర్నర్ ధన్యవాద తీర్మానంపై వైసీపీ ఎమ్మెల్సీలు అసహనం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వ హయాంలో సంక్షేమం ఎక్కువగా జరిగిందని బొత్స సత్యనారాయణ, కూటమి హయాంలోనే సంక్షేమం అమలవుతోందని పార్థసారధి వాదించారు. అన్నదాత సుఖీభవకు రూ.20వేలు ఇచ్చామని చెబుతున్నారని, అదే నిజమైతే క్షమాపణ చెబుతామని వైసీపీ సభ్యులు తెలిపారు. ఆందోళనల మధ్యే చైర్మన్ మోషేన్ రాజు మండలిని రేపటికి వాయిదా వేశారు. అటు ఏపీ అసెంబ్లీ కూడా రేపటికి వాయిదా పడింది.

మధ్యాహ్నం వరకే మండలి..

ఏపీ శాసనమండలి బీఏసీ సమావేశంలో మండలి సమయాలపై అన్ని పార్టీల సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ సభను నడపాలని చైర్మన్ మోషేన్ రాజు నిర్ణయించారు. ప్రతిరోజూ గంటన్నరపాటు ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని తీర్మానించారు. ఈ సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలను క్లుప్తంగా ఇవ్వాలని చైర్మన్ సూచించారు.

Next Story