AP | క్వాంటం యుగంలోకి అమరావతి

by Thanuru Gopichand |

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది.

AP | క్వాంటం యుగంలోకి అమరావతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి సాంకేతిక కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటి అమరావతి క్వాంటం వ్యాలీ (Amaravati Quantum Valley - AQV) స్థాపన కోసం అంతర్జాతీయ దిగ్గజ సంస్థలైన ఐబీఎం (IBM), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), మరియు లార్సన్ అండ్ టూబ్రో (L&T) లతో కీలక అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకుంది. ​ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కింద అమరావతిలోని క్వాంటం వ్యాలీ టెక్ పార్క్లో కీలకమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. ​

క్వాంటం కంప్యూటింగ్ సెంటర్

క్వాంటం వ్యాలీలో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్‌లలో ఒకటైన ఐబీఎం క్వాంటం సిస్టమ్ 2 ను నెలకొల్పనున్నారు. ఇది 156-క్విబిట్ హెరాన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది దేశంలోనే తొలి అత్యంత శక్తివంతమైన సంస్థాపన కానుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే క్వాంటం వ్యాలీ కార్యకలాపాలను వచ్చే జనవరి నాటికి ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటూ వాటిని వేగంగా అమలుపరుస్తోంది. తద్వారా లక్షిత సమయంలోపు ప్రాజెక్టును విజయవంతం చేసే దిశగా సాగుతోంది.

​భూ కేటాయింపులు

ఈ క్వాంటం వ్యాలీ కోసం మొత్తం 50 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అందులో భాగంగా రెండు ఎకరాల విస్తీర్ణంలో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (AQCC) ను గ్రీన్ బిల్డింగ్ విధానంలో నిర్మించనున్నారు. ఈ క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రధాన లక్ష్యం క్వాంటం పరిశోధన, హార్డ్‌వేర్ ఉత్పత్తి, గ్లోబల్ సహకారాలు, నైపుణ్యాభివృద్ధికి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడమని ప్రభుత్వం చెబుతోంది.

భాగస్వామ్య సంస్థలు

​ఈ ఒప్పందంలో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటరును అమరావతిలో స్థాపించడమే లక్ష్యంగా ఐబీఎం పని చేస్తోంది. అంతేకాకుండా పరిశోధన, శిక్షణ, పర్యావరణ వ్యవస్థకు మద్ధతునివ్వడం కీలక పాత్రను ఐబీఎం పోషించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. టీసీఎస్ సంస్థ జీవశాస్త్ర అనుబంధ అంశాలు, ఆర్థిక సేవలు, ప్రొడక్షన్ అండ్ సైబర్ సెక్యూరిటీ రంగాల కోసం క్వాంటం సాంకేతికతతో పరిష్కారాలను అభివృద్ధి చేయడం, విద్యా సంస్థలతో కలిసి ప్రతిభావంతులను నిపుణులుగా మార్చడం వంటి అంశాలపై పని చేయనుందని తెలుస్తోంది. క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ప్రధాన భవనం, అనుబంధ మౌలిక సదుపాయాలను ఎల్ అండ్ టీ సంస్థ పూర్తి చేయనుంది.

క్వాంటం భవిష్యత్తుకు బాట

​ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్వాంటం సిటీని సాకారం చేసేందుకు పట్టుదలతో, అంకితభావంతో పని చేస్తున్నారు. గతంలో హైదరాబాద్‌కు ఐటీ విప్లవాన్ని అందించిన విధంగానే, ఇప్పుడు అమరావతిని క్వాంటం టెక్నాలజీకి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్వాంటం వ్యాలీ ద్వారా రాష్ట్రంలో ఉన్నత స్థాయి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, పరిశోధన, ఆవిష్కరణలకు ఊతం లభిస్తుందని ముఖ్యమంత్రి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. సిలికాన్ వ్యాలీ తరహాలోనే అమరావతిని క్వాంటం వ్యాలీగా మార్చడమే లక్ష్యమని ఇటీవల ప్రకటించారు. ​ఈ ప్రాజెక్టు నేషనల్ క్వాంటం మిషన్ (NQM) లక్ష్యాలకు అనుగుణంగా ఉందని, ఇది భారతదేశాన్ని క్వాంటం టెక్నాలజీ రంగంలో ప్రపంచ స్థాయిలో నిలపడానికి దోహదపడుతుందని ప్రభుత్వం విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది.

Next Story