- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ సాయం అందజేస్తున్నా అసత్య ప్రచారం.. వైసీపీపై వ్యవసాయ కమిషన్ ఫైర్
ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే అమలు చేసి అన్నదాతలకు అండగా నిలిచిందని ఏపీ వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ...

దిశ,వెబ్ డెస్క్: ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే అమలు చేసి అన్నదాతలకు అండగా నిలిచిందని ఏపీ వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను రాజుగా చూడాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రకటించిందన్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.20 వేల సాయం అందించాలనే హామీని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే రైతులకు రూ.14 వేల సాయం అందించగా, మూడో విడతగా 46,85,838 మంది రైతులకు రూ.6,000 చొప్పున మొత్తం రూ.8,935 కోట్లను సీఎం చంద్రబాబు నాయుడు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారని వెల్లడించారు. రైతులకు ఇంత భారీ సాయం అందుతున్నా కూడా వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.
గతంలో గొప్పగా..
వైసీపీ నేతలు గతంలో రూ.13 వేలే ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటూ, ఇప్పుడు రూ.20 వేల సాయం అందిస్తున్న కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల రాజకీయాల కోసం అబద్ధాలు చెప్పడం సరికాదని అన్నారు. వ్యవసాయం నిలవాలంటే రైతు గెలవాలనే దృక్పథంతో విత్తనం నుంచి విక్రయం వరకు వ్యవసాయాన్ని బలోపేతం చేసే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని, పంటల కొనుగోలులో కూడా పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం పంట కొనుగోలు చేసిన 24 నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధానాన్ని అమలు చేస్తోందన్నారు. వైసీపీ హయాంలో మాత్రం రైతులు తమ పంటలకు డబ్బులు పొందడానికి మూడు నుంచి నాలుగు నెలలు వేచి చూడాల్సి వచ్చేదని గుర్తుచేశారు.
ఉపయోగపడే సూచనలివ్వండి
వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయి చాలా ఆత్మహత్యలు జరిగిన ఘటనలు రాష్ట్రం చూసిందన్నారు. జగన్ నిర్లక్ష్య పాలనలో రైతులకు సరైన భరోసా లేకపోవడం, పంటలకు గిట్టుబాటు ధరలు అందకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సాగుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. సాంకేతికతను వ్యవసాయంలో ప్రవేశపెట్టి యువత కూడా ఉద్యాన, ప్రకృతి వ్యవసాయం వైపు ముందుకు రావడానికి ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. 2026 డిసెంబర్ నాటికి భూసమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారని తెలిపారు. వైసీపీ అసత్యాలు, అర్థసత్యాలు ప్రచారం చేయకుండా రైతుల అభివృద్ధికి ఉపయోగపడే విలువైన సూచనలు ఇవ్వాలని మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.






