లిక్కర్ కేసులో మరో సంచలనం.. మాజీ మంత్రి నారాయణ స్వామి ఇంట్లో తనిఖీలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-22 07:43:29  IST  )

లిక్కర్ కేసులో మరో సంచలనం నమోదు అయింది...

లిక్కర్ కేసులో మరో సంచలనం.. మాజీ మంత్రి నారాయణ స్వామి ఇంట్లో తనిఖీలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కాం కేసు(Liquor scam case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కాంలో మాజీ మంత్రి నారాయణ స్వామి(Liquor scam case)పైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పుత్తూరులోని ఆయన ఇంట్లో సిట్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కేసులో మరింత లోతు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం నారాయణస్వామి నివాసానికి వెళ్లారు. గత ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తి నుంచి ఒత్తిడి వల్లే లిక్కర్ పాలసీపై నారాయణస్వామి సంతకాలు పెట్టినట్లు సిట్ అధికారులు అనుమానించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ లిక్కర్ పాలసీని తీసుకొచ్చిన సమయంలో ఎక్సైజ్ మంత్రిగా నారాయణ స్వామి ఉండటంతో సిట్ అధికారులు ఆయన్ను విచారించాలని నిర్ణయించారు. దీంతో లిక్కర్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులపై ఆరా తీశారు. ఆర్డర్స్, ఆన్ లైన్ విధానం తొలగింపుతో పాటు మాన్యువల్ విధానాన్ని తీసుకురావడంపైనా ప్రశ్నించారు. అలాగే మద్యం పాలసీలో జరిగిన మార్పులు, వాటి వెనుక ఎవరున్నారు..? అని నారాయణ స్వామిని సిట్ పోలీసులు విచారించారు.

కాగా మద్యం కేసులో విచారణకు హాజరుకావాలని గత నెలలో నారాయణస్వామికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే అనారోగ్య కారణాలు చూపుతూ ఆయన విచారణకు హాజరు కాలేదు. నారాయణస్వామి అప్రూవర్ గా మారతారనే ప్రచారం కూడా అప్పుడు జరిగింది. ఇపుడు సిట్ బృందం నేరుగా పుత్తూరుకు రావడంతో స్థానిక వైసీపీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. నారాయణస్వామిని అరెస్టు చేస్తారని కూడా ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇది వాస్తవం కాకపోవచ్చు. కాగా నారాయణస్వామి విచారణకు రాలేనందున తామే వచ్చి విచారణ చేస్తున్నామని సిట్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం నారాయణస్వామి ఇంట్లో ఆయనతో పాటు కుమార్తె కృపారాణి ఉన్నారు. సిట్ అధికారులు ఎవరినీ లోపలకు అనుమతించ లేదు.

Next Story