జోగి సోదరులపై మరో కేసు నమోదు

by Thanuru Gopichand |

బెయిల్ పై విడుదలైన క్రమంలో అనుమతి లేకుండా భారీ ర్యాలీ నిర్వహణ.

జోగి సోదరులపై మరో కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్ : నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) ఆయన సోదరుడు రాము (Jogi Ramu) గత కొంత కాలంగా అండర్ ట్రయల్ ఖైదీలుగా జైలులో ఉన్నారు. వారికి బెయిల్ మంజూరు కావడంతో శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా వారిపై మరో కేసును పోలీసులు నమోదు చేశారు. ఇటీవల జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన జోగి సోదరులు భారీ ర్యాలీగా ఇంటికి బయలుదేరారు. ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ భారీ వాహనాలతో ర్యాలీగా రహదారులపై హల్ చల్ చేశారు. శుక్రవారం వారు నిర్వహించిన ర్యాలీ కారణంగా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అంతేకాకుండా ర్యాలీలో టపాసులను కాల్చడం వల్ల ఇతర ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలు డీజే పెట్టేందుకు ప్రయత్నించారు. వారిని నియంత్రించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడలేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ విషయమై కానిస్టేబుల్ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు జోగి సోదరులపై బీఎన్ఎస్ 126(2), 292 రెడ్ విత్ 19(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story