ములకలచెరువు నకిలీ మద్యం కేసులో మరో అరెస్టు!

by Thanuru Gopichand |

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో (Fake Liquor Scam) కీలక పరిణామం చోటు చేసుకుంది.

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో మరో అరెస్టు!
X

దిశ, వెబ్ డెస్క్ : ములకలచెరువు నకిలీ మద్యం కేసులో (Fake Liquor Scam) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ మాజీ ఇంచార్జి, పార్టీ బహిష్కృత అయిన జయచంద్రారెడ్డిని (Jaya Chandra Reddy) పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. నకిలీ మద్యం కేసులో A17గా ఉన్న జయచంద్రారెడ్డిని బెంగళూరులో అరెస్టు చేశారని సమాచారం. ఈ అరెస్టుతో ములకలచెరువు నకిలీ మద్యం సంచలనాత్మక కేసు దర్యాప్తులో పోలీసులు మరో ముందడుగు వేసినట్లయింది. కాగా బుధవారం ఈ కేసులో ప్రధాన నిందితుడైన జయచంద్రారెడ్డికి చెందిన అకౌంటెంట్ అన్బురాజు ను ఎక్సైజ్ పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. నకిలీ మద్యం కేసులో ఏ-19గా ఉన్న అన్బురాజ్ ను అరెస్టు అనంతరం తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అన్బురాజ్ కు 14 రోజుల రిమాండ్ విధించడంతో అతన్ని మదనపల్లి సబ్ జైలుకు తరలించారు.

​ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నవారి అరెస్టులతో కేసు దర్యాప్తు వేగవంతమైంది. ముఖ్యంగా ఈ నకిలీ మద్యం వ్యవహారం తంబళ్లపల్లె నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం, ఈ కేసులో మరో నిందితుడు గిరిధర్ రెడ్డి కోసం ఎక్సైజ్ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితులైన జయచంద్రారెడ్డి, అన్బురాజ్ ల అరెస్టుతో ఈ నకిలీ మద్యం సరఫరా, తయారీ వెనుక ఉన్న పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులను కూడా త్వరలో పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ అరెస్టులతో నకిలీ మద్యం తయారీ, అమ్మకాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరిక పంపినట్లైందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Next Story