దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

by Thanuru Gopichand |

ఓం నమో వెంకటేశాయ

దేవుని కడప శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
X

దిశ, వెబ్ డెస్క్ : కడప నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దేవుని కడప (Devuni Kadapa) శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీవారి క్షేత్రానికి 'తొలి గడప'గా పేరుగాంచిన ఈ ఆలయంలో జనవరి 27వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో మొదటి రోజైన నేడు ఉదయం 10 గంటలకు మీన లగ్నంలో శాస్త్రోక్తంగా 'ధ్వజారోహణం' కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ వేడుకల కోసం ఆలయాన్ని విద్యుత్ దీపాలు మరియు పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజూ ఉదయం, రాత్రి సమయాల్లో స్వామివారు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టాలైన జనవరి 24న స్వామి వారి 'కల్యాణోత్సవం', జనవరి 25న 'మహారథోత్సవం' నిర్వహించనున్నారు. జనవరి 27న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనుండగా, జనవరి 28వ తేదీన పుష్పయాగం జరగనుంది. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీతం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాయలసీమ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Next Story