ఆంజనేయా.. మగవాళ్లకు ఒక పండుగ ఉందయ్యా!

by Thanuru Gopichand |

దశాబ్దాల క్రితం సాధువు చెప్పిన మాట నేడు ఆచారంగా మారింది.

ఆంజనేయా.. మగవాళ్లకు ఒక పండుగ ఉందయ్యా!
X

దిశ, వెబ్ డెస్క్ : ఆడవాళ్లకు అనేక పండుగలుంటాయి. కానీ మగవాళ్ల పండుగలు తక్కువనే చెప్పుకోవాలి. కానీ రాజంపేటలో మగవాళ్లకు కూడా ఓ పండుగ ఉంది. ఇది ప్రత్యేకంగా మగవాళ్ల కోసం మాత్రమే అనడంలో సందేహం లేదు. ఈ పండుగలో ఆడవారికి ప్రవేశం నిషిద్ధం కూడా.

వివరాల్లోకి వెళ్తే ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు రాజంపేట దగ్గర్లో మగవాళ్ల పండుగ (Magavalla Panduga) పేరుతో ప్రతి ఏడాది ఒక పండుగను నిర్వహిస్తారు. సంక్రాంతి కంటే ముందుగా వచ్చే ఆదివారం నాడు ఈ పండుగను జరుపుతారు. ఇందులో భాగంగా మగవాళ్లతో పొంగళ్లను తయారు చేయిస్తారు. ఈ సందర్భంగా గుడిలోకి ఆడవారికి ప్రవేశం పూర్తి నిషేధం. పండగ సమయంలో పూజలు చేసేది, పొంగళ్లు వండేది మగవారే కావడం గమనార్హం. ఆడవారు బయట నుంచే దేవతామూర్తులకు దండం పెట్టుకోవాలి. ఈ పండుగ వేళ ఊరికి సంబంధించిన వారు దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా తప్పకుండా వస్తారు. కట్టెల నుంచి వంట సామాగ్రి వరకు అన్నీ మగవారే సమీకరించుకుంటారు. స్వయంపాకం చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అదే విధంగా ఈ ప్రసాదం ఆడవారు తినకూడదనే నిబంధన కూడా అమలులో ఉంది. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లి (Tippayapalli) గ్రామంలో ఉన్న శ్రీ సంజీవరాయస్వామి దేవాలయంలో (Sri Sanjeevaraya Swamy Devaalayam) దశాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది.

అయితే ఈ ఆచారం వెనుక ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. 1516 సంవత్సరంలో తిప్పాయిపల్లి గ్రామంలో కరువు కాటకాలు వచ్చాయి. అప్పుడు తిప్పాయిపల్లి గ్రామానికి వచ్చిన సాధువు ఆంజనేయ స్వామికి ఆలయం నిర్మించి మగవాళ్లు మాత్రమే స్వయంగా స్వామివారికి ప్రసాదం చేసి నివేదించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలు ఆలయ ప్రవేశం చేయకూడదని చెప్పారని ప్రతీతి. ఆ తరువాత ఆంజేయస్వామి విగ్రహంపై బీజాక్షరాలు రాసిన స్వామి అందరి ముందే మాయమైనట్లు గ్రామస్తులు చెబుతుంటారు. అయితే సాధువు రూపంలో వచ్చింది ఆంజనేయ స్వామి అని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు. నాటి నుంచి నేటి వరకు ప్రాంతమంతా పచ్చగా కళకళలాడుతోందని అంటారు. అందుకే స్వామివారిని సంజీవరాయుడిగా కొలుస్తూ మగవాళ్లు పొంగళ్లను వండుతున్నారు.

Next Story