ఆక్వా సాగుపై మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్.. నేడు చలో వీరవాసరం

by Naga Rani Yarlagadda |

యుద్ధం ప్రారంభం కాక‌ముందు ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో 100 కౌంట్ రూ.280 పైబ‌డి కొనుగోళ్లు చేశారు. యుద్ధం ప్రారంభం అయిన నాటి నుంచి ఈ ధ‌ర తగ్గింది.

ఆక్వా సాగుపై మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్.. నేడు చలో వీరవాసరం
X

దిశ‌, కోన‌సీమ ప్ర‌తినిధి: మ‌ధ్య ప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్ దేశాల మ‌ధ్య న‌డుస్తోన్న యుద్థం ఆక్వా రైతుల పాలిట శాపంగా మారింది.. ఎగుమ‌తులు బంద్ అయ్యాయ‌ని ఎక్స్‌పోర్ట‌ర్లు ఒక్క‌సారిగా కొనుగోళ్లు నిలిపివేసి ధ‌ర‌లు త‌గ్గించేయ‌డంతో ఆక్వా రైతులు అయిన‌కాడికి అమ్ముకుంటున్నారు.. నిజానికి ఈ యుద్ధ ప్ర‌భావం వ‌ల్ల ఆక్వా ప‌రిశ్ర‌మ ఎగుమ‌తులకు ఎటువంటి ఇబ్బందులు లేక‌పోయినా కృత్రిమ స‌మ‌స్య‌లు సృష్టించి ధ‌ర‌లు త‌గ్గించేశారంటున్నారు ఆక్వా రైతులు.. ఏపీలో ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి ఆక్వా ఎగుమ‌తులు ఎక్కువ కాగా రాష్ట్రానికి ఆదాయాన్ని స‌మ‌కూర్చే పంట‌ ల్లో ఆక్వా ప‌రిశ్ర‌మ ముఖ్య‌మైన‌ద‌ని, నిజానికి యుద్ధ ప్ర‌భావం ఆక్వా ఎగుమ‌తుల‌పై లేక‌పోయినా ఇదే సాకు గా చూపుతోన్న ఎగుమ‌తు దారులు కొనుగోళ్ల విష‌యం లో ధ‌ర‌ల కొర్రీ పెడుతున్నార‌ని, దిక్కుతోచ‌ని స్థితిలో వారు నిర్ణ‌యించిన ధ‌ర‌ల‌కే అమ్ముకోవాల్సి వ‌స్తోంద‌ని ఆక్వా రైతాంగం ముక్త‌కంఠంతో వాపోతోంది.. అమెరికా, యూరోపియ‌న్ కంట్రీస్‌, మ‌రో పక్క చైనా వియాత్నం దేశాలకు రొయ్య‌ల ఎగుమ‌తులు ఎక్కువగా జ‌రుగుతుండ‌గా కొంత కాలంగా మిడిల్ ఈస్ట్ దేశాల‌కు రొయ్య‌లు ఎగుమ‌తులు చేస్తున్నారు.. అయితే ఇది చాలా త‌క్కువ శాతం అని రైతులు అంటున్నారు.. ప్ర‌స్తుతం అమెరికా, చైనా లాంటి దేశాల‌కు చేసే ఎగుమ‌తుల‌కు ఎటువంటి ఇబ్బందులు లేవంటున్నారు.. అయిన‌ప్ప‌టికీ ఆక్వా ప‌రిశ్ర‌మ గ‌డ్డుప‌రిస్థితి ఎదుర్కొంటుందంటున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ట్రంప్ సుంకాల దెబ్బ త‌మ‌ను ఆర్థికంగా దెబ్బ‌తీయ‌గా, విద్యుత్తు స‌బ్సిడీ విష‌యంలో కూడా కూట‌మి ప్ర‌భుత్వం ఇంత‌వ‌ర‌కు ఎన్నిక‌ల నాటి హామీల‌ను నెర‌వేర్చ‌లేద‌ని, వైసీపీ ప్ర‌భుత్వంలో రాష్ట్రంలో నాన్ ఆక్వాజోన్ అంటూ ప‌రిమితులు సృష్టించి, ప‌ది ఎక‌రాల సాగుకు మించ‌కూడ‌ద‌ని నిబంధన‌లు పెట్టి 12 వేల స‌ర్వీసుల‌కు పైగా విద్యుత్తు స‌బ్సిడీ క‌నెక్ష‌న్లు తొల‌గించార‌ని, కూట‌మి ప్ఱ‌భుత్వం తాము అధికారంలోకి వ‌చ్చాక అన్ని క‌నెక్ష‌న్లు ఇస్తామ‌ని చెప్పి ఇప్ప‌టికీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోతున్నారు.. మ‌రోప‌క్క నాసిర‌కం సీడ్‌, మేత‌ల్లో ధ‌రాఘాతం త‌దిత‌ర స‌మ‌స్య‌లు త‌మ‌ను అధ‌పాతాళానికి ప‌డేస్తున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.. ఈనేప‌థ్యంలోనే ఛ‌లో వీర‌వాస‌రం కార్య‌క్ర‌మానికి ఆక్వారైతాంగం పిలువునివ్వ‌గా ఆదివారం ఈ స‌మావేశంలో ప్రాధాన్య‌త నెల‌కొంది..

ప్ర‌స్తుతం ధ‌ర‌ల ప‌త‌నం ఇలా..

యుద్ధం ప్రారంభం కాక‌ముందు ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో 100 కౌంట్ రూ.280 పైబ‌డి కొనుగోళ్లు చేశారు. యుద్ధం ప్రారంభం అయిన నాటి నుంచి ఈ ధ‌ర కాస్త 100 కౌంట్ నుంచి 50 కౌంట్ వ‌ర‌కు ట‌న్నుకు రూ.30 వేలు, అదే 50 పైబ‌డిన కౌంట్‌కు ట‌న్నుకు రూ.60 వేలు చొప్పున త‌గ్గించి కొనుగోళ్లు చేస్తున్నార‌ని, కేవ‌లం యుద్ధం సాకు చూపించి రైతుల క‌ష్టానికి ద‌క్కాల్సిన ఫ‌లితాన్ని ఎక్స్‌‌పోర్ట‌ర్ల సిండికేట్ జేబుల్లోకి వెళుతోంద‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు..

న‌ష్టాల ఊబిలోకి వెళుతున్నామంటున్న రైతాంగం..

ఆక్వా అంటే డాల‌ర్ల పంట‌గా పేరొందిన ఈ ప‌రిశ్ర‌మ వ‌రుస న‌ష్టాల‌తో సంక్షోభంవైపు ప‌య‌నిస్తోంద‌ని, దీనిని స‌రిదిద్దాల్సిన ప్ర‌భుత్వం ఆదిశ‌గా చ‌ర్య‌లు చూప‌డం లేద‌ని కొంత మంది పెద‌వి విరుస్తున్నారు.. చెరువుల్లో వేసే సీడ్ ద‌శ నుంచి ద‌గాకు గురవుతోన్న ఆక్వా రైతాంగం అడుగ‌డుగునా న‌ష్టాలే చ‌విచూస్తున్నామంటున్నారు. కొన్ని హేచ‌రీలు చేస్తున్న మోసాల‌కు సీడ్ వేసిన‌ నెల రోజులు గ‌డ‌వ‌కుండానే చ‌నిపోవ‌డం జ‌రుగు తోంద‌ని, కొన్ని చెరువుల్లో అయితే ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోవ‌డంతో పెట్టుబ‌డి చాంతాడంత పెరిగి న‌ష్టాల ఊబిలోకి వెళ్తున్నామంటున్నారు. హేచ‌రీ ల్లో క్వాలిటీ మెయింటినెన్స్ చేసి మంచిర‌కం సీడ్ ఇవ్వ‌క‌ పోవ‌డం వ‌ల్ల‌నే ఏహెచ్‌పీ, విబ్రియో వంటి తెగుళ్ల తో రైతులు ఈ మ‌ధ్య‌ కాలంలో వేసిన 80 శాతం మంది దీని బారిన ప‌డి న‌ష్ట‌పోయారంటున్నారు. మ‌రోప‌క్క ముడిస‌రుకుల ధ‌ర‌లు త‌గ్గినా విప‌రీతంగా పెంచేస్తోన్న మేత‌ల ధ‌ర‌లు, ఇత‌ర సామగ్రి మ‌రిత న‌ష్టాన్ని మిగులుస్తున్నాయంటున్నారు.

యుద్ధభ‌యంతో ప‌ట్టుబ‌డులు అనేది అవాస్త‌వం..

ఆంధ్ర ప్ర‌దేశ్ ఫిష‌రీస్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ (ఏపీ సెడా) వైస్ ఛైర్మ‌న్ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి ఇటీవ‌లే ప‌త్రికా ముఖంగా యుద్ధం ధ‌ర‌ల ప‌త‌నానికి సంబంధం లేద‌ని, యుద్ధ భ‌యంతో ఒకే సారి ప‌ట్టుబ‌డులు చేస్తుండ‌డం వ‌ల్ల ఉత్ప‌త్తి అమాంతంగా పెరిగిపోవ‌డంతో ధ‌ర‌లు త‌గ్గుతున్నాయ‌ని చెప్ప‌డం స‌రైంది కాదంటున్నారు ప‌లువురు రైతులు.. అటువంట‌ప్పుడు ప్ర‌భుత్వం చొర‌వచూపి ఎక్స్‌పోర్ట‌ర్ల‌పై ఒత్తిడిచేసి రైతులు ఎవ్వ‌రూ అధైర్య ప‌డ‌వ‌ద్ద‌ని చెప్పాల‌ని, కానీ అటువంటి ప‌రిస్థితి రాష్ట్రంలో లేదంటున్నారు. గ‌త ప్ర‌భుత్వంలో క‌రోనా స‌మ‌యంలో ఎమ్మెస్పీ ప్రొవైడ్ చేసి అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రొయ్య‌ల ఎగుమ‌తులు చేసి ఒబ్బిడి చేశారని, దీనివ‌ల్ల రైతాంగం న‌ష్టాల ఊబినుంచి త‌ప్పించుకున్నార‌ని గుర్తు చేస్తున్నారు.. అయితే ఈ యుద్ధం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం నుంచి ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌లు ఏమీ లేవ‌ని, ఇందుకే రైతులు అపార‌న‌ష్టాల‌ను చ‌విచూస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏపీ సెడా వైస్ ఛైర్మ‌న్ ప్ర‌క‌ట‌న అనంత‌రం కూడా ఎగుమ‌తి దారుల్లో ఎటువంటి మార్పు రాలేద‌ని, అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఎటువంటి వ్య‌త్యాసాలు లేక‌పోయినా ఇక్క‌డ మాత్ర‌మే ఎందుకు త‌గ్గిస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

Next Story