- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొప్పగా చదివి సమాజానికి మంచిని పంచండి : ప్రభుత్వ విప్
కక్షలు, కార్పన్యాలకు దూరంగా ప్రశాంతమైన జీవన విధానాన్ని విద్యార్థి దశ నుండే అలవర్చుకోవాలి.

దిశ, రాయదుర్గం : ఆడపిల్లలు చదువుకుంటే ఆ కుటుంబంతో పాటు ప్రాంతం కూడా బాగుపడుతుందని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు శుక్రవారం ఆయన సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చదువు ద్వారానే సంపదతో పాటు సమాజంలో, కుటుంబంలో గౌరవం, శక్తి లభిస్తాయన్నారు. చదువుకునే దశలో చదువే ప్రపంచంగా బతకగలిగితే మీ లక్ష్యాలను అవలీలగా సాధించే శక్తి మీకు వస్తుందని తెలియజేశారు. ముఖ్యంగా బాలికల విద్య సమాజానికి చాలా అవసరం అన్నారు. 2014-19 మధ్యన తాను చదువుల ఒడి పేరుతో అర్ధాంతరంగా పాఠశాలను వదిలేసిన బాలికలను తిరిగి పాఠశాలలో చేర్పించి ప్రోత్సహించడం జరిగిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదిన సందర్భంగా 75 మంది తల్లి తండ్రి లేని అనాధ బాలికలను చదివిస్తానని ప్రకటించానన్నారు.
స్థానిక పాఠశాలలో ఎవరైనా అలాంటి పిల్లలు ఉంటే గుర్తించి తన దృష్టికి తీసుకువస్తే.. వారి చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంజూరై, నిరుపయోగంగా ఉన్న 40 సైకిళ్లను నేడు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. బాలికలు పాఠశాలకు రావడానికి అనువుగా సైకిళ్లను టిడిపి ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం వాటిని మరుగున పడేసిందని ఆందోళన వ్యక్తపరిచారు. దాంతో ఐదేళ్లపాటు మూలన పడ్డ సైకిళ్ళకు మరమ్మతులు చేయించి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో బాలికలకు పంపిణీ చేస్తున్నామని వివరించారు.
బాలికల్లో డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి ఇవి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంట్లో పని ఒత్తిడి కారణంగా తల్లిదండ్రులు కూడా పాఠశాలకు ఎందుకు పోతావులే..! అంత దూరం అని వారిని నిరుస్తాహా పరిచే వాతావరణము ఉంటుందన్నారు. అట్లాంటి పిల్లలకు సైకిల్ ఉంటే వాళ్ళు నేరుగా స్కూలుకు ఆ సైకిల్ పైన వచ్చి వెళ్లే దానికి అవకాశం ఉంటుందన్నారు. ఇది బాలికల విద్యకు ఎంతగానో ఉపయోగపడే మంచి కార్యక్రమం అన్నారు. విద్యతో పాటు ఉద్యోగాల్లోనూ మంచి ఫలితాలు రాబట్టాలన్న బాలికల చదువుకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు.
కక్షలు, కార్పన్యాలకు దూరంగా ప్రశాంతమైన జీవన విధానాన్ని విద్యార్థి దశ నుండే అలవర్చుకోవాలని సూచించారు. అందరూ బాగుండాలని కోరుకోవడం మంచి సమాజ నిర్మాణానికి దోహదపడుతుందనీ కాలవ హితోపదేశం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, కరెన్న, కార్పొరేషన్ డైరెక్టర్ పోరాళ్ల పురుషోత్తం,అగ్రహారం కిరణ్, కెడిమి తిప్పేస్వమి,పైతోట రామంజి,హెచ్. ఆనంద్, వై.వెంకటేశులు, ఆటో వెంకటేశులు,బండి భారతి, బంగి శంకర్,కొండాపురం శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.






