- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనంతపురం జిల్లా | పీఏబీఆర్ కుడి కాలువలో గండి
అనంతపురం (Anantapuram) జిల్లాలో సాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న పీఏబీఆర్ (Penna Ahobilam Balancing Reservoir) కుడికాలువకు పెను విఘాతం కలిగింది.

దిశ, వెబ్ డెస్క్ : అనంతపురం (Anantapuram) జిల్లాలో సాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న పీఏబీఆర్ (Penna Ahobilam Balancing Reservoir) కుడికాలువకు పెను విఘాతం కలిగింది. కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలో కాలువకు భారీ గండి పడటంతో, అందులోని నీరు ఉధృతంగా పొలాల్లోకి ప్రవహిస్తోంది. ఈ ఘటనతో సమీపంలోని పదుల ఎకరాల్లో వేసిన పంటలు పూర్తిగా నీట మునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటికే ప్రకృతి విపత్తులు, నీటి కొరతతో అల్లాడుతున్న రైతులు, ఈ ఆకస్మిక గండి పడడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పనిచేయని గేట్లు
కాలువకు గండి పడిన విషయం తెలిసిన వెంటనే నీటి సరఫరాను నియంత్రించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. అయినా కూడా కుడి కాలువ గేట్లు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడినట్లు తెలిపారు. దీంతో కాలువలో ప్రవాహం తగ్గక, నీరు పొలాల్లోకి నిరంతరం చేరి నష్టాన్ని మరింత పెంచిందని రైతులు వాపోతున్నారు. గేట్లు సక్రమంగా నిర్వహించకపోవడం, కాలువ పర్యవేక్షణలో లోపాలే ఈ పరిస్థితికి కారణమని స్థానిక రైతులు మండిపడుతున్నారు. పంటలన్నీ చేతికందే సమయంలో నీట మునిగి పోవడంతో మాకు తీవ్ర నష్టం వాటిల్లింది. పీఏబీఆర్ కాలువ గేట్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించి, నీటి ప్రవాహాన్ని అరికట్టి, పంటలను రక్షించాలి అని రైతులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నీటిపారుదల శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. గండి పూడ్చివేత పనులను వేగవంతం చేసి, నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.






