- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anantapur | పేకాట స్థావరం.. డ్రోన్ నిఘాతో బహిర్గతం
అనంతపురం జిల్లా (Anantapur) పోలీసులు వినూత్న విధానాలను అవలంబిస్తున్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, ముఖ్యంగా పేకాట స్థావరాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా (Anantapur) పోలీసులు వినూత్న విధానాలను అవలంబిస్తున్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు, ముఖ్యంగా పేకాట స్థావరాలపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగా రాయదుర్గం మండలం గొల్లలదొడ్డి గ్రామ శివారు ప్రాంతంలో శుక్రవారం యదేచ్ఛగా జరుగుతున్న పేకాట స్థావరాన్ని పోలీసులు డ్రోన్ (Drone) సహాయంతో గుర్తించారు. గుర్తించడమే కాకుండా పేకాట ఆడుతున్న వారిపై మెరుపు దాడి చేశారు. పోలీసుల ఈ వినూత్న నిఘా విధానం పేకాట ఆడేవారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
గొల్లలదొడ్డి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో ఏడుగురు వ్యక్తులు గుమిగూడి పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. అయితే గతంలో మాదిరిగా నేరుగా దాడి చేయకుండా, అనుమానితుల కదలికలను ముందుగా డ్రోన్ ద్వారా నిశితంగా పరిశీలించాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఆకాశంలో చక్కర్లు కొడుతున్న డ్రోన్ శబ్దం వినగానే, తమ స్థావరంపై నిఘా పడిందని పేకాట ఆడేవారు గ్రహించారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డి ఆందోళనపడ్డారు. పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకునేందుకు పొలాల్లోకి, ముళ్లపొదల్లోకి పరుగు లంకించుకున్నారు. ఇదంతా కూడా డ్రోన్ విజువల్స్ లో రికార్డు అయ్యింది. అయితే వారి పారిపోతున్న దిశలను కూడా పోలీసులు గమనిస్తున్నారనే విషయాన్ని పేకాట ఆడిన వారి గ్రహించలేదు.
అయితే డ్రోన్ ద్వారా వారి కదలికలను పర్యవేక్షించిన పోలీసులు పారిపోతున్న ఏడుగురు వ్యక్తులను చుట్టుముట్టి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 15,050 రూపాయల నగదుతో పాటు పేకాట ఆడేందుకు వినియోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కొత్త టెక్నాలజీని ఉపయోగించి పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించడంపై స్థానికులు, ముఖ్యంగా శివారు ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో డ్రోన్ నిఘా ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఈ తరహా నిఘాను కొనసాగించాలని కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిఘా కొనసాగుతుందని, ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసు అధికారులు హెచ్చరించారు.






