అనంతపురం : సిమెంట్ కర్మాగారంలో ఇరువర్గాల ఘర్షణ

by Thanuru Gopichand |

వాహన ఆపరేటర్ల మధ్య వాగ్వివాదంతో చెలరేగిన గొడవ. అద్దాలు, ద్విచక్ర వాహనాలు ధ్వంసం.

అనంతపురం : సిమెంట్ కర్మాగారంలో ఇరువర్గాల ఘర్షణ
X

దిశ, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా యాడికి మండలం గుడిపాడు (Gudipadu) వద్ద ఉన్న సాగర్ సిమెంట్ కర్మాగారంలో (Sagar Cement Factory) ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఫ్యాక్టరీ ప్రాంగణం ఒక్కసారిగా రణరంగంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్మాగారంలో వాహన ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న బాలాంజనేయులు, శ్రీనివాసులు మధ్య పని విషయంలో మొదట చిన్నపాటి వాగ్వాదం మొదలైంది. ఇది కాస్తా ముదిరి ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవకు దారితీసింది. కోపోద్రిక్తులైన ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకోవడంతో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణ సమయంలో ఆందోళనకారులు కర్మాగారం కార్యాలయంపై దాడి చేసి కిటికీ అద్దాలను పగులగొట్టారు. అంతేకాకుండా, అక్కడ నిలిపి ఉంచిన పలు ద్విచక్ర వాహనాలను కూడా ధ్వంసం చేయడంతో ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కర్మాగారం వద్ద ఉద్రిక్తత కొనసాగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘర్షణకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story