కోనసీమలో సాధారణ స్థితికి మంటలు! బ్లో అవుట్ నియంత్రణకు అమెరికా నిపుణులు

by Ramesh Naini |   (  Updated:2026-01-08 06:54:44  IST  )

బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కారణంగా సోమవారం చెలరేగిన మంటలు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.

కోనసీమలో సాధారణ స్థితికి మంటలు! బ్లో అవుట్ నియంత్రణకు అమెరికా నిపుణులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Irusumanda Blowout) బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ కారణంగా సోమవారం చెలరేగిన మంటలు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. బ్లో అవుట్ ప్రాంతంలో మంటలు ఎగసిపడుతూనే ఉన్నప్పటికీ, వాటి తీవ్రత నిన్నటితో పోలిస్తే కొంత మేర తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. బ్లో అవుట్‌ను పూర్తిగా నియంత్రించేందుకు వారం నుంచి పది రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఓఎన్జీసీ అధికారులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. బ్లో అవుట్‌ను పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ సంస్థ అమెరికాకు చెందిన విపత్తుల నివారణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ సంస్థకు చెందిన నిపుణులు ఒకటి రెండు రోజుల్లో సంఘటనా స్థలానికి చేరుకోనున్నారని వెల్లడించారు.

డ్రిల్లింగ్ పనుల వల్లే గ్యాస్ లీక్..

సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో ఇరుసుమండలోని మోరి-5 ఓఎన్జీసీ బావిలో డ్రిల్లింగ్ పనులు కొనసాగుతుండగా అకస్మాత్తుగా గ్యాస్ లీక్ జరిగి మంటలు వ్యాపించాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం మంటల ఉద్ధృతి తగ్గి సహజ వాయువు సాధారణ స్థాయిలో మండుతోందని, గ్యాస్ ఎక్కడి నుంచి వెలువడుతోందో గుర్తించే పనిలో నిపుణుల బృందం నిమగ్నమై ఉందని కలెక్టర్ తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైరింజన్లు, భారీ వాటర్ క్యానన్లతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

అడ్వాన్డ్స్ వాటర్ టెండర్లు..

అడ్వాన్డ్స్ వాటర్ టెండర్ల ద్వారా నిరంతరంగా నీటి స్ప్రింక్లింగ్ చేస్తున్నారు. మంటల తీవ్రత తగ్గినప్పటికీ, ఇంకా ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతుండటంతో అప్రమత్తత కొనసాగిస్తున్నారు. సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా లక్కవరం గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు ఇదివరకే తరలించినట్లు అధికారులు తెలిపారు.

Next Story