ముద్రగడ ఆత్మ శాంతి కోసమే పోలీసులను అడ్డుకున్నా: అంబటి రాంబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-16 09:34:49  IST  )

కూటమి ప్రభుత్వంలో కాపులపై వేధింపులు పెరిగాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో అంబటి రాంబాబుపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై ఆయన స్పందించారు...

ముద్రగడ ఆత్మ శాంతి కోసమే పోలీసులను అడ్డుకున్నా: అంబటి రాంబాబు
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వంలో కాపులపై వేధింపులు పెరిగాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో అంబటి రాంబాబుపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై ఆయన స్పందించారు. ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని వ్యాఖ్యానించారు. ముద్రగడ ఆత్మశాంతించడం కోసమే పోలీసులను అడ్డుకున్నానని అంబటి తెలిపారు. తాను కాపుల ప్రతినిధి కాదని పవన్ కల్యాణ్ చెప్పుకున్నప్పుడు కూటమిలో ఎందుకుండాలని ప్రశ్నించారు. వంద కేసులు పెట్టుకున్నా భయపడేది లేదన్నారు. కూటమి ప్రభుత్వంపై కాపులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

నాపై చంద్రబాబు, లోకేశ్, డీజీపీ స్పెషల్ ఫోకస్

‘‘నాపై చంద్రబాబు, లోకేశ్, డీజీపీ ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఏ చిన్న సంఘటనా జరిగినా ఎఫ్ఐఆర్ కట్టేస్తున్నారు. అమరావతికి వెళ్లిన సమయంలో నేను పోలీసులతో ఘర్షణ పడినప్పుడు కూడా కేసు పెట్టారు. రాజమండ్రి జైలు నుంచి బయటకు వస్తున్నప్పుడు కూడా ఓ కేసు పెట్టారు. ముద్రగడ పద్మనాభం కుటుంబం మాకు అధికార లాంఛనాలు వద్దు అని ప్రకటించింది. వాళ్లు వద్దంటే మీరెందుకు చేస్తున్నారు. ఏమిటీ రాజకీయ కుట్ర. ముద్రగడ బతికి ఉన్నప్పుడు చిత్ర హింసలకు గురి చేశారు. చనిపోయిన తర్వాత అధికార లాంఛనాలు ఇవ్వాలనుకుంటే ఆయన ఆత్మ శాంతించదు. ఆయన వద్దు అని చెప్పి వెళ్లాడు. అయినా ఎందుకు వచ్చారు. ఇది తప్పు కదా..?. ఆయన కుటుంబం వద్దూ అని చెప్పినా వచ్చారు. ఏదో గొప్పతనాన్ని సాధించాలనే తాపత్రయం. ఇక్కడ కూడా రాజకీయం చేశారు. అందుకే అడ్డుకున్నాం. పద్మనాభం ఆత్మ శాంతించడం కోసం అడ్డుకున్నాం. ఇది తప్పు అని నేను అనుకోవడం లేదు. నాపై 100 కేసులు పెట్టినా ముద్రగడ ఆత్మ శాంతించాలి.’’ అని అంబటి పేర్కొన్నారు.

Next Story