అమరావతి అన్‌స్టాపబుల్ : ఆత్మగౌరవ ప్రస్థానం నుంచి అఖండ విజయం వరకూ..

by Naga Rani Yarlagadda |

అమరావతి అన్‌స్టాపబుల్ : ఆత్మగౌరవ ప్రస్థానం నుంచి అఖండ విజయం వరకూ..
X

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అవ్వడం అనేది నిన్న ఒక కలగా ఉంటే.. నేడొక నిశ్చయంగా మారింది. రేపు ఒక అద్భుతంగా మారనుంది. ఐదుకోట్ల మంది ఆంధ్రుల ఆశల సౌధం, 34 వేల మంది రైతుల త్యాగ ఫలం మన అమరావతి. కాలం ఎన్ని పరీక్షలు పెట్టినా, అడుగులు తడబడినా.. లక్ష్యం మాత్రం చెదరలేదు. పార్లమెంట్ సాక్షిగా అమరావతికి చట్టబద్ధత లభించడంతో.. అది అన్ స్టాపబుల్ గా మారింది.

త్యాగమే పునాదిగా..

ఏ రాష్ట్రంలో రాజధానికైనా ఇటుకలు పునాదులైతే.. అమరావతి నిర్మాణానికి మాత్రం రైతుల త్యాగం, నమ్మకమే పునాదులయ్యాయి. కడుపుకోతను భరించి, పచ్చని పొలాలను రాజధాని కోసం ధారపోసిన 34 వేల మంది రైతుల త్యాగం సామాన్యమైనది కాదు. ఆ త్యాగమే నేడు అమరావతి కేవలం ఒక నగరంలా కాకుండా.. అందరి భావోద్వేగంగా మారింది. మధ్యలో ఎన్నో సందిగ్ధతలు, మరెన్నో అడ్డంకులొచ్చినా, ఆటుపోట్లు ఎదురైనా భూములిచ్చిన రైతుల పోరాట పటిమ అమరావతి జ్యోతిని ఆరిపోకుండా కాపాడింది.

దేశం గొంతుకై.. ఆంధ్రుల ఆత్మాభిమానానికి దక్కిన గౌరవం

విభజన తర్వాత సొంత రాజధాని లేకుండా పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ కు.. అమరావతి ఒక భవిష్యత్తుగా మారింది. కొన్నేళ్లుగా అమరావతి విషయంలో సాగిన అనిశ్చితికి కూటమి ప్రభుత్వం తెరదించుతూ.. రాష్ట్ర అసెంబ్లీలో అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపి.. దానిని పార్లమెంట్ కు పంపింది. పార్లమెంట్ ఈ బిల్లుకు చట్టబద్ధతనిస్తూ ఆమోదం తెలుపడం చారిత్రాత్మక మలుపనే చెప్పాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ యావత్ దేశం.. అమరావతి ఆంధ్రుల రాజధాని అని ముక్తకంఠంతో చాటిచెప్పింది. ఆ క్షణాలు ఆంధ్రులను భావోద్వేగానికి గురిచేశాయి. ఇది ఆంధ్రుల ఆత్మాభిమానానికి దక్కిన జాతీయ గౌరవమనడంలో అతిశయోక్తి లేదు.

ఆంధ్రుల సంకల్పం అమరావతి

బలమైన చట్టబద్ధత తోడవ్వడంతో.. ఇప్పుడు అమరావతి నిర్మాణం శరవేగంగా సాగనుంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఐటీ హబ్ లు, విద్యాసంస్థలు, పర్యాటక కేంద్రాలతో కూడిన ప్రపంచస్థాయి రాజధానిగా రూపుదిద్దుకోనుంది. అమరావతికి చట్టబద్ధత రావడంతో పెట్టుబడిదారులకు నమ్మకం పెరిగి, యువతకు ఉపాధి ఆశలు చిగురించాయి. అమరావతి అంటే కేవలం భవనాల సముదాయం కాదని, అది ఆంధ్రుల సంకల్పమని నిరూపితమైంది. నిన్నటి పోరాటం.. నేటి గౌరవంగా మారింది. ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎంతమంది అడ్డు తగిలినా సరే.. ప్రజాబలం, చట్టబద్ధత తోడైన అమరావతి ప్రయాణం ఇక ఆపడం ఎవ్వరితరం కాదని తాజాగా జరిగిన రాజధాని సంబరాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి ఇక అన్ స్టాపబుల్ రాజధాని అని హర్షం వ్యక్తం చేశారు.

Next Story