విశ్వనగరంగా అమరావతి, పంచాంగ శ్రవణంలో వేద పండితులు, ఏపీలో ఘనంగా ప్రభుత్వ ఉగాది వేడుకలు

by Ramesh Naini |

ఏపీలోని విజయవాడలో ఉగాది వేడుకలు అంబరాన్నంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

విశ్వనగరంగా అమరావతి, పంచాంగ శ్రవణంలో వేద పండితులు, ఏపీలో ఘనంగా ప్రభుత్వ ఉగాది వేడుకలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలోని విజయవాడలో ఉగాది వేడుకలు అంబరాన్నంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం, రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్: పంచాంగ శ్రవణం

ఈ సందర్భంగా ప్రముఖ వేద పండితులు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా పరుగులు పెడుతుందని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా అమరావతి విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఈ ఏడాది కాలం కలిసి వస్తుందని పంచాంగంలో వెల్లడించారు. అనంతరం సీఎం, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సాంప్రదాయబద్ధంగా ఉగాది పచ్చడిని స్వీకరించారు.

కళాకారులకు ‘కళారత్న’ పురస్కారాల ప్రదానం

వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 160 మంది ప్రముఖులను ప్రభుత్వం ఈ సందర్భంగా ఘనంగా సత్కరించింది.38 మందికి ప్రతిష్టాత్మకమైన కళారత్న పురస్కారాలు, 122 మందికి రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాలు.. సాహిత్యం, సంగీతం, కళారంగాల్లో కృషి చేసిన వారికి సీఎం చంద్రబాబు నాయుడు హంస జ్ఞాపికలను అందజేసి, శాలువాలతో సత్కరించారు.

కష్టసుఖాల కలయికే జీవితం: సీఎం చంద్రబాబు

సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఉగాది పచ్చడిలోని షడ్రుచుల వలె జీవితంలో కూడా కష్టసుఖాలు సహజం. పండుగలు మనకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుస్తాయి’ అని పేర్కొన్నారు. అలాగే తన హయాంలోనే మూడోసారి గోదావరి, కృష్ణా పుష్కరాలను నిర్వహించుకునే అదృష్టం కలగడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో నీటి భద్రత, ప్రకృతి పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధతో పాటు పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story