ఏఐ ఆధారిత క్రాప్.. అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ : అధికారులతో సీఎం సమీక్ష

by Ramesh Naini |

ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.

ఏఐ ఆధారిత క్రాప్.. అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ : అధికారులతో సీఎం సమీక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు, 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. దీనిని సమర్థవంతంగా అమలు చేస్తూ 2030-31 నాటికి 40 లక్షల మంది రైతులు, 50 లక్షల ఎకరాలలో ప్రకృతి సాగు చేపట్టేలా చూడాలని స్పష్టం చేశారు. వ్యవసాయం, అనుబంధ శాఖలపై అధికారులతో సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, దీంతో రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి, పంట ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందన్నారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల నాణ్యత తెలిసేలా సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సదుపాయం కల్పించాలన్నారు.

క్రాప్ అడ్వయిజరీ ‘భారత్ విస్తార్’

సుభాష్ పాలేకర్‌తో రాష్ట్రమంతటా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. ఏఐ ఆధారిత క్రాప్ అడ్వయిజరీ ‘భారత్ విస్తార్’ వంటి వాటిని రాష్ట్రంలోనూ వినియోగించుకోవాలన్నారు. యూఎస్, ఈయూతో ట్రేడ్ ఒప్పందం నేపథ్యంలో రాష్ట్రం నుంచి రొయ్యలు, ఎండుమిర్చి, మామిడి, వరి, ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులు పెంచుకునేందుకు మరింత అవకాశం కలిగిందని అధికారులు వివరించగా, అయితే నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి కేంద్ర పాలసీలకు అనుగుణంగా రాష్ట్ర పాలసీలు ఉండాలని చెప్పారు. డిజి రైతు బజార్ యాప్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కే అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story