దెబ్బతగిలి ఆసుపత్రికి వెళ్తే.. కుక్క కాటు ఇంజెక్షన్ ఇచ్చారు

by Thanuru Gopichand |

కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడిందట.

దెబ్బతగిలి ఆసుపత్రికి వెళ్తే.. కుక్క కాటు ఇంజెక్షన్ ఇచ్చారు
X

దిశ, వెబ్ డెస్క్ : దెబ్బ తగిలిందని ఆసుపత్రికి వెళ్తే.. కుక్క కరిచిందనుకొని కుక్క కాటుకు (Dog Bite) ఇంజెక్షన్ వేశారు. ఈ ఘటన శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే స్కూల్ లో శ్యామ్ (Shyam) అనే బాలుడు స్కూల్లో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అతను కిందపడగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలుడిని శ్రీకాకుళం జిజిహెచ్ (GGH) కు తీసుకెళ్లారు. అయితే ఆ బాలుడిని తీసుకొచ్చిన సమయంలోనే మరో ఇద్దరు బాలురను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ బాలుడిని కుక్క కరవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఈ క్రమంలో అయోమయానికి గురైన సిబ్బంది కుక్క కరిచిన బాలుడికి వేయాల్సిన ఇంజెక్షన్ ను శ్యామ్ అనే బాలుడికి వేశారు. యాంటీ రేబిస్ ఇంజెక్షన్ వేసిన విషయం తెలుసుకున్న శ్యామ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ కొడుకు ప్రాణాలతో జిజిహెచ్ సిబ్బంది చెలగాటం ఆడిందని ఆరోపిస్తూ ఆందోళనలు వ్యక్తం చేశారు. దెబ్బ తగిలిన బాలుడికి యాంటీ రేబిస్ ఇంజెక్షన్ వేయడం ఏమిటని వైద్యులను నిలదీశారు. అయితే అది పొరపాటున జరిగిందని.. బాలుడికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బాలుడి కుటుంబ సభ్యులు మాట వినకపోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. బాధిత కుటుంబ సభ్యులకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపివేశారు. అయితే సిబ్బంది తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Next Story