అన్న క్యాంటీన్‌ల కోసం అడ్వైజరీ కమిటీల ఏర్పాటు

by Thanuru Gopichand |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల (Anna Canteens) సమర్థవంతమైన పర్యవేక్షణ, నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

అన్న క్యాంటీన్‌ల కోసం అడ్వైజరీ కమిటీల ఏర్పాటు
X

దిశ, వెబ్ డెస్క్ : ​ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల (Anna Canteens) సమర్థవంతమైన పర్యవేక్షణ, నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ (MA & UD) ద్వారా జీ.ఓ.ఆర్.టి. నెం. 1350ను శుక్రవారం విడుదల చేసింది. ఈ జీవో ద్వారా రాష్ట్రంలో 'అన్న క్యాంటీన్ లెవెల్ అడ్వయిజరీ కమిటీల' ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ చేసిన ప్రతిపాదనలు, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అందిన సూచనల మేరకు ఈ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కమిటీల ప్రధాన ఉద్దేశం క్యాంటీన్ల నిర్వహణను మెరుగుపరచడం, పారదర్శకతను పెంచడమని పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొన్నారు.

​ప్రతి అన్న క్యాంటీన్ స్థాయిలో ఏర్పాటు చేసే ఈ అడ్వయిజరీ కమిటీలో చైర్మన్‌తో సహా మొత్తం ఆరుగురు సభ్యులు ఉండనున్నారు. జిల్లా ఇంఛార్జి మంత్రి ద్వారా ఈ సభ్యులను నామినేట్ చేస్తారు. కమిటీకి చైర్మన్‌గా మున్సిపల్ ఛైర్‌పర్సన్ లేదా స్థానిక కార్పొరేటర్/కౌన్సిలర్ వ్యవహరించనున్నారు. దీనితో పాటు, వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ, అలాగే వార్డు ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీలను సభ్యులుగా నియమిస్తారు. పౌర సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, స్థానిక ఎన్జీఓ (NGO) నుండి ఒక ప్రతినిధిని, అలాగే స్వయం సహాయక బృందం, టి.ఎల్.ఎఫ్ నుండి ఒక ప్రతినిధిని కూడా సభ్యులుగా చేర్చారు. సంబంధిత అన్న క్యాంటీన్ నోడల్ అధికారి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

​ఈ అడ్వయిజరీ కమిటీలకు విస్తృతమైన బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ కమిటీలు అన్న క్యాంటీన్ల నిర్వహణలో జవాబుదారీతనం, సేవా నాణ్యత, పారదర్శకత, పౌర భాగస్వామ్యం ఉండేలా చూస్తాయి. వీటిలో ముఖ్యంగా క్యాంటీన్ల వద్ద సర్వీస్ క్వాలిటీ, పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేయడం ప్రధాన విధిగా ఉండనుంది. దీని కోసం, వారానికి రెండుసార్లు నిర్దేశిత చెక్‌లిస్ట్ ఆధారంగా తనిఖీలు నిర్వహించాలి. ఈ కమిటీల ద్వారా స్థానిక ప్రజల భాగస్వామ్యం పెరిగి, అన్న క్యాంటీన్ సేవలు మరింత సమర్థవంతంగా, పేదలకు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని అధికారులు తెలిపారు.

Next Story