కార్యకర్తల అత్యుత్సాహం.. రప్పా రప్పా పోస్టర్ కలకలం

by Thanuru Gopichand |

అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దల మాట.. ఏదైనా కూడా మోతాదుకు మించితే అది ప్రమాదకరంగా పరిణమిస్తుందని దాని అర్థం.

కార్యకర్తల అత్యుత్సాహం.. రప్పా రప్పా పోస్టర్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దల మాట.. ఏదైనా కూడా మోతాదుకు మించితే అది ప్రమాదకరంగా పరిణమిస్తుందని దాని అర్థం. అది కూరలో ఉప్పు కావొచ్చు.. చాయ్ లో చక్కెర కావొచ్చు.. చలి కాలంలో ఫ్యాను గాలి కావొచ్చు.. అది పరిమితి దాటినప్పుడు వెగటు పుట్టిస్తుంది. కొన్నిసార్లు ఫర్వాలేదు అనిపించినా దాని సైడ్ ఎఫెక్టులు మాత్రం గట్టిగానే ఉంటాయి. అదే సూత్రం రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో పార్టీ కార్యకర్తల అత్యుత్సాహం నాయకుల పీకల మీదకు తెస్తుంది. మరికొన్ని సందర్భాల్లో వారు ఓడిపోవడానికి కూడా కారణమవుతుంది.

అందుకే సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా అభిమానం ఉండాలి గానీ దురభిమానం కాదు. అది వ్యక్తిగత కక్ష సాధింపులకు, వ్యక్తుల మధ్య పగాప్రతీకారాలకు దారి తీయొద్దు. అయితే గత కొంత కాలంగా వైసీపీ కార్యక్రమాల్లో రప్పా రప్పా పోస్టర్ల ప్రదర్శన సాధారణమైపోయింది. పుష్పా 2 సినిమాలో ఫేమస్ అయిన ఈ డైలాగ్ నేడు వైసీపీ కార్యక్రమాల్లో చక్కర్లు కొడుతోంది. మళ్లీ అన్న అధికారంలోకి వస్తాడు.. మేము మీ అంతు చూస్తాము అనే సందేశంలో చాలా వరకు పోస్టర్లు తయారవుతున్నట్లు తెలుస్తోంది. అంటే నేరుగానే ఇతరులపై ద్వేషం విరజిమ్ముతున్నట్లు పోస్టర్లలో స్పష్టమవుతోంది.

అటువంటి ఒక పోస్టర్ వైయస్ జగన్ జన్మదిన సందర్భంగా ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో ఏర్పాటు చేయబడింది. 2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడినే అనే సందేవం కలకలం రేపుతోంది.

ఇదంతా అభిమానులుగా చూసే వారికి మంచిగానే అనిపించినా.. ఇతర పార్టీల వారికి రెచ్చగొట్టే విధంగానూ.. సాధారణ ప్రజానీకానికి రాక్షసత్వంగానూ కనిపించే అవకాశాలు లేకపోలేదు. పోస్టర్ తాత్కాలికంగా కార్యకర్తకు సంతోషాన్ని ఇవ్వొచ్చు కానీ.. అటు పార్టీకి ఇటు నాయకుడికి మాత్రం రాజకీయంగా నష్టాన్నే కలిగిస్తుంది. అంతేకాకుండా ఎదుటి పక్షం వారు విమర్శించేందుకు తావు ఇచ్చినట్లు అవుతుంది.

కోడికత్తి, బాబాయ్ హత్య, సీబీఐ కేసులు, పరాకమణి చోరీ, కల్తీ నెయ్యి వివాదాలతో వైసీపీ అధినేత ఇప్పటికే తల పట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. అధికారంలోకి వచ్చాక మళ్లీ రప్పా రప్పా అంటూ నరికేస్తామనే సందేశం ఇస్తే.. ప్రజలు ఈ సారి సున్నా సీట్లు ఇచ్చి ఇంటికి పరిమితం చేసే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కాబట్టి వైసీపీ పెద్దలు, రాజకీయ వ్యూహకర్తలు కేవలం నేతల మాటలే కాదు, కార్యకర్తల చేతలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటే మంచిదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రజలకు సుపరిపాలన చేసేవారు కావాలి కానీ గంజాయి స్మగ్లర్లు, నేర ప్రవృత్తి కలిగిన వారి స్ఫూర్తితో పని చేసేవారు కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.

Next Story