పోక్సో కేసులో నిందితుడుకి 20 ఏళ్ల జైలు శిక్ష

by Thanuru Gopichand |

పోలీసు సిబ్బందిని అభినందించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు.

పోక్సో కేసులో నిందితుడుకి 20 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : పోక్సో కేసులో (POCSO Case) నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు (Ongole Court) సంచలన తీర్పును ఇచ్చింది. కోర్టు న్యామూర్తి కె.శైలజ ఈ తీర్పును గురువారం వెలువరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగరాయకొండ మండలానికి చెందిన కళ్లగుంట హరి (22) జనవరి 14, 2019న ఇంటి వద్ద ఆడుకుంటున్న 7 ఏళ్ల బాలికను మభ్యపెట్టాడు. బాలికను భవనంపైకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు సింగరాయకొండ పోలీసులకు (Singarayakonda Police) ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాటి ఒంగోలు ఎస్డీపీఓ రాధేశ్ మురళీ ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అనంతరం కోర్టులో ఛార్జిషీట్ వేశారు.

పోలీసులు ఎప్పటికప్పుడు సాక్షలను కోర్టులో హాజరుపరిచారు. జిల్లా ఎస్పీ మార్గదర్శనంలో పోక్సో మానిటరింగ్ టీం ద్వారా సమర్థవంతంగా ట్రయల్ నడిపించారు. సరైన సాక్ష్యాధారాలను సమర్పించి నిందితుడిపై నమోదు చేసి నేరారోపణలను నిరూపించారు. దీంతో జనవరి 29, 2026న ఒంగోలు పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.శైలజ తీర్పును వెలువరించారు. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అదే విధంగా బాధిత బాలికకు మూడు లక్షల రూపాయల కంపెన్సెషన్ ను ప్రకటించారు.

కేసులో ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు అభినందించారు. అత్యాచారాలకు పాల్పడే వ్యక్తులకు ఇటువంటి తీర్పులు గుణపాఠంగా నిలవాలన్నారు. బాలికలు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య వస్తే తల్లిదండ్రులకు చెప్పాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

పై కేసులో ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులను, కోర్టు లైజన్ ఏఎస్ఐ ఇ.వి.స్వామి, కానిస్టేబుల్ యల్లమంద, ఎస్.కొండ హెడ్ కానిస్టేబుల్ రంగారావు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాస రావులకు ఎస్పీ ప్రత్యేక అభినందలను తెలియజేశారు.

Next Story