ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం

by Thanuru Gopichand |

రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus) రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన కర్నూలు (Kurnool) జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కావేరి ట్రావెల్స్ (Kaveri Travels) కు చెందిన బస్సు పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. కర్నూలు మీదుగా బస్సు ప్రయాణం సాగించింది. ఈ క్రమంలో కర్నూలు నగర శివారులోని టిడ్కో గృహాల (TIDCO Houses) సమీపంలోకి రాగానే బస్సు అదుపు తప్పింది. అంతటితో ఆగకుండా డివైడర్ అవతలవైపు వెళ్లింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రమాద సమయంలో ఎదురుగా వేరే వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. బస్సులో సుమారు 29 మంది ప్రయాణిస్తున్నారని సమాచారం. అయితే ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి విచారణ చేపట్టి వివరాలను తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి అంతగా ఫలితం ఇవ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాహనాల డ్రైవర్లు కూడా బాధ్యతగా నడిపినప్పుడే పూర్తి స్థాయిలో రోడ్డు ప్రమాదాలను నివారించడంలో సాధ్యపడుతుందనే అభిప్రాయం ప్రజల నుంచి వెల్లడవుతోంది.

Next Story