రాష్ట్రంలో ఏసీబీ వరుస దాడులు

by Thanuru Gopichand |

అవినీతి అధికారుల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు.

రాష్ట్రంలో ఏసీబీ వరుస దాడులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ (ACB) రైళ్లు పరిగెత్తిస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు (Properties More Than Income) కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా వరుసగా మెరుపు దాడులు నిర్వహిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా దగదర్తి తహశీల్దార్ పాలకృష్ణ (Tahsildar Palakrishna) ఇళ్లలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు సోదాలు (ACB Raids) చేపట్టారు. నెల్లూరుతో పాటు ఆయన బంధువులు, మిత్రుల నివాసాలు కలిపి మొత్తం 8 చోట్ల ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, కీలకమైన భూ పత్రాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. కేవలం రెవెన్యూ శాఖలోనే కాకుండా న్యాయశాఖ ఉద్యోగులపై అందిన ఫిర్యాదుల నేపథ్యంలో గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని మరో ఐదు ప్రాంతాల్లో కూడా అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.

అంతకుముందు రోజు కూడా ఏసీబీ అధికారులు ఒకేసారి రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు చేసి అక్రమార్కుల గుట్టు రట్టు చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గ్రేడ్-2 ఉద్యోగిగా పనిచేస్తున్న నల్లపోగు తిరుమలేశ్ ఆస్తులపై రేణిగుంట, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సోదాలు నిర్వహించారు. అదే సమయంలో విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న ఎన్.శ్రీనివాస రావు నివాసాల్లోనూ తనిఖీలు జరిపారు. ఒక సాధారణ హోంగార్డు సుమారు రూ. 20 కోట్ల వరకు అక్రమాస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించడం గమనార్హం. వరుసగా జరుగుతున్న ఈ దాడులు ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలను విశ్లేషిస్తున్నారని, సోదాలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయి వివరాలను వెల్లడిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

Next Story