రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్..!

by Ramesh Naini |

ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) కింద ఉచిత వైద్య సేవలు నిలిచిపోనున్నాయి.

రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) కింద ఉచిత వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 3,000 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. గత నాలుగు నెలలుగా సుమారు రూ. 2500 కోట్ల నుంచి రూ. 3000 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయినా.. వాటి చెల్లింపులపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. పాత బకాయిల సంగతి తేల్చకుండా, ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ‘ఇన్సూరెన్స్ మోడల్’ (యూనివర్సల్ హెల్త్ కవరేజ్) అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆసుపత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పాత బకాయిల బాధ్యత ఎవరు తీసుకుంటారని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. 2017 నాటి పాత ప్యాకేజీ ధరలనే ఇంకా కొనసాగిస్తున్నారు. పెరిగిన వైద్య, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా పాత రేట్లకు వైద్యం అందించడం సాధ్యం కాదని స్పష్టం చేశాయి.

రోడ్డెక్కి పోరాడుతాం..

బకాయిలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నచిన్న ఆసుపత్రులు సైతం మూతపడే పరిస్థితి నెలకొందని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు విడుదల చేసి, ప్యాకేజీ ధరలను సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే రోడ్డెక్కి పోరాడుతామని హెచ్చరించారు. ఈ పరిణామాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story