90వ వసంతంలోకి ఆకాశవాణి: తొమ్మిది దశాబ్దాల ప్రస్థానం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-10 03:03:55  IST  )

గత తొమ్మిది దశాబ్దాలుగా విశిష్ట సేవలందిస్తూ ఆకాశవాణి కేంద్రం సమాజంలోని ప్రతి వర్గానికి చేరువైందని విజయవాడ రీజినల్ ఛానెల్ మేనేజర్ ఎం. సోమేశ్వరరావు కొనియాడారు.

90వ వసంతంలోకి ఆకాశవాణి: తొమ్మిది దశాబ్దాల ప్రస్థానం
X

దిశ, ఏపీ బ్యూరో: గత తొమ్మిది దశాబ్దాలుగా విశిష్ట సేవలందిస్తూ ఆకాశవాణి కేంద్రం సమాజంలోని ప్రతి వర్గానికి చేరువైందని విజయవాడ రీజినల్ ఛానెల్ మేనేజర్ ఎం. సోమేశ్వరరావు కొనియాడారు. ఆకాశవాణి 90వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శనివారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల కాలంగా కళాకారులకు ప్రాణప్రదమైన వేదికగా, రైతులకు వెన్నెముక వంటి మిత్రుడిగా, యువతకు సరైన మార్గదర్శిగా నిలుస్తూ ఈ సంస్థ ప్రజల అచంచలమైన నమ్మకాన్ని గెలుచుకుందని పేర్కొన్నారు. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కళాతపస్వి కె. విశ్వనాథ్, గొల్లపూడి మారుతీరావు, కొంగర జగ్గయ్య వంటి మహనీయుల కళా ప్రస్థానానికి ఆకాశవాణి విజయవాడ కేంద్రం తొలి వేదికగా నిలిచిందని గుర్తుచేశారు. సమాచార విప్లవం వేగంగా మారుతున్నా తన విశ్వసనీయతను కాపాడుకుంటూ, ప్రస్తుతం డిజిటల్ మాధ్యమాల్లోనూ కొత్త తరానికి ఆకాశవాణి చేరువవుతోందని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా 585 స్టేషన్ల ద్వారా 92.5 శాతం ప్రజలకు, 99.17 శాతం భౌగోళిక ప్రాంతానికి ఆకాశవాణి సేవలు విస్తరించాయని చెప్పారు. కార్యక్రమ విభాగాధిపతి గుడుపూడి దివ్య మాట్లాడుతూ ఆకాశవాణి 90వ వార్షికోత్సవాల సందర్భంగా జూన్ 8, 2025 నుంచి జూన్ 8, 2026 వరకు ఏడాది పొడవునా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్వేపల్లి సిస్టర్స్ గాత్ర కచేరీతో పాటు గరగ నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తామనితెలిపారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల విజేతలకు అదే వేదికపై బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. మే 19న ఉదయం ప్రత్యేక వాకథాన్ నిర్వహిస్తామని వెల్లడించారు. న్యూస్ విభాగాధిపతి టి. హెన్రీ రాజ్ మాట్లాడుతూ సమాచార విప్లవం ఎంత వేగంగా మారుతున్నా, ఆకాశవాణి తన విశ్వసనీయతను, ప్రామాణికతను కాపాడుకుంటోందన్నారు. టీఆర్పీ కోసం కాకుండా వాస్తవ ఆధారిత వార్తలను అందించడం ఆకాశవాణి ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యూస్ ఆన్ ఎయిర్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా శ్రోతలు కార్యక్రమాలు వినగలుగుతున్నారని తెలిపారు. బెల్జియం వంటి యూరప్ దేశాల నుంచి కూడా ఆకాశవాణి ప్రసారాలకు స్పందన వస్తోందన్నారు. సమావేశం అనంతరం అధికారులు 'స్వర సంధ్య' సాంస్కృతిక కార్యక్రమాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Next Story