- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పని ఒత్తిడి తట్టుకోలేక సచివాలయ ఉద్యోగిని మృతి
అనారోగ్యానికి గురై మరణించినట్లు అనుమానాలు.

దిశ, వెబ్ డెస్క్ : పని ఒత్తిడి తట్టుకోలేక సచివాలయ ఉద్యోగిని మృతి చెందిన ఘటన కడప నగరంలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల నగరంలోని గౌస్ నగర్ కు చెందిన జి.విజయకుమారి (42) సచివాలయంలో హెల్త్ సెక్రటరీగా పని చేస్తు్న్నారు. జనవరి 17న పాత కడప యూపీహెచ్సీలో విధి నిర్వహణలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు ఉన్నతాధికారులు ఫోన్ కాల్ చేశారు. సర్వేలు ఎందుకు చేయడం లేదని.. పై నుంచి చాలా ఒత్తిడి ఉందని.. తప్పకుండా సర్వేలు చేయాల్సిందేనని గదమాయించారని తెలుస్తోంది. పండుగ సమయంలో విధులు నిర్వహిస్తున్నా కూడా ఉన్నతాధికారులు మాట్లాడిన తీరుతో విజయకుమారి ఒత్తిడికి గురైనట్లు కనిపిస్తోంది.
ఇంటికి వచ్చిన తరువాత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆమె తన కుమార్తెతో చెప్పింది. ఆదివారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతోందని చెప్పి అలానే ఒరిగిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తరువాత ఎంతకీ కళ్లను తెరవలేదని అంటున్నారు. ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగానే విజయకుమారి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
విషయం తెలుసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు బాధితురాలు ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ అధికారుల ఒత్తిడి భరించలేక సచివాలయ ఉద్యోగులు చనిపోతున్నారని ఆరోపించారు. గతంలో ఒక సచివాలయానికి 10 మంది సిబ్బందితో పాటు, 20 మంది వలంటీర్లు ఉండేవారని పేర్కొంటున్నారు. ఇప్పుడు కేవలం ఐదుగురికే సంఖ్య పరిమితమైందని వాపోతున్నారు. దీనివల్ల తమపై ఒత్తిడి పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






