ఏపీలో కొత్త పొలిటికల్ మ్యాప్ : 263కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-15 02:34:29  IST  )

ఏపీలో కొత్త పొలిటికల్ మ్యాప్ : 263కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు!
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల ముఖచిత్రం మారనుంది. ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు 263గా, లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38గా మారనున్నాయి. అలాగే మహిళా రిజర్వేషన్ల స్థానాల్లోనూ స్పష్టమైన మార్పు రానుంది. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులను రెండింటినీ ఈ నెల 16న పార్లమెంటులో ప్రవేశపెట్టనుండటమే ఇందుకు కారణం.

బిల్లు ఆమోదం తర్వాత ‘కమిషన్‌’ ఏర్పాటు

నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లు ప్రతిపాదనల ప్రకారం.. రాష్ట్రంలో 38 వరకు లోక్‌సభ స్థానాలు, 263 వరకు అసెంబ్లీ స్థానాలు పెంచనున్నారు. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు సైతం పెరగనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది. అనంతరం సీట్ల పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి.. పెరిగిన స్థానాలతోనే 2029 ఎన్నికలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

50 శాతం పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

ఏపీ అసెంబ్లీ సామర్థ్యం ప్రస్తుతం 175గా ఉంది. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ప్రస్తుతం ఉన్న స్థానాలను 50 శాతం చెప్పున పెంచనున్నారు. ఈ లెక్క ప్రకారం 88 సీట్లు అదనంగా పెరిగి ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 263కు పెరుగుతాయి. అలాగే మొత్తం శాసనసభ స్థానాల్లో 87 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు. ఇక లోక్‌సభ స్థానాల విషయానికొస్తే ఏపీలో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్ల సంఖ్య 25. డీలిమిటేషన్‌ తర్వాత ఈ సంఖ్య 38కి పెరగనుంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందితే ఇందులో 13 ఎంపీ సీట్లు మహిళలకు కేటాయించనున్నారు.

ఎస్సీ, ఎస్టీలకు పెరగనున్న స్థానాలు

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే స్థానాల సంఖ్య కూడా పెరగనుంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లలో ఎస్సీలకు 29 స్థానాలు రిజర్వ్‌ చేయగా.. ఎస్టీలకు మరో 7 స్థానాలు కేటాయించారు. లోక్‌సభ స్థానాల విషయానికి వస్తే అమలాపురం, బాపట్ల, తిరుపతి, చిత్తూరు లోక్‌సభ సీట్లను ఎస్సీలకు, అరకు లోక్‌సభ స్థానాన్ని ఎస్టీలకు రిజర్వు చేశారు. అయితే డీలిమిటేషన్‌ తర్వాత ఈ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

డీలిమిటేషన్‌తో కీలక మార్పులు

నియోజకవర్గాల పునర్విభజన వల్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధి తగ్గి పాలనా సౌలభ్యం ఏర్పడుతుంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పార్టీలకు వెసులుబాటు లభిస్తుంది. గతంలో డీలిమిటేషన్‌ జరిగినప్పుడు భౌగోళిక సరిహద్దులు, ఓటర్ల సంఖ్య, రిజర్వుడు స్థానాల పరంగా భారీగా మార్పులు జరిగాయే తప్పా.. మొత్తంగా నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు. అందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న డీలిమిటేషన్‌ బిల్లు నిర్ణయం వల్ల నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరగనుంది. 50 శాతం చెప్పున అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి.

Next Story