శేషాచలం అడవుల్లో అద్భుతం.. శాస్త్రవేత్తల ఊహకందని జీవి ప్రత్యేక్షం

by Yella Dhawani Reddy |

తూర్పు కనుమల్లో భాగమైన ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం రిజర్వ్‌ ఫారెస్ట్‌ జీవవైవిధ్యానికి పెట్టింది పేరు.

శేషాచలం అడవుల్లో అద్భుతం.. శాస్త్రవేత్తల ఊహకందని జీవి ప్రత్యేక్షం
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పు కనుమల్లో భాగమైన ఆంధ్రప్రదేశ్‌లోని (Andhrapradesh) శేషాచలం రిజర్వ్‌ ఫారెస్ట్‌ (Seshachalam Reserve Forest) జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. తాజాగా, ఈ అటవీ ప్రాంతంలో జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ZSI) శాస్త్రవేత్తలు అరుదైన జీవిని కనుగొన్నారు. చూసేందుకు పామును పోలి, ఉండే ఈ జీవి స్కింక్‌ (నలికిరి) జాతిలో కొత్త రకంగా గుర్తించారు. చర్మంపై వివిధ చారలు, పాక్షికంగా పారదర్శక కనురెప్పలు ఉండటం దీని ప్రత్యేకత. ప్రకృతి కళగా ఆకట్టుకునే ఈ జీవికి ‘డెక్కన్‌ గ్రాసైల్‌ స్కింక్‌’ (Deccan Gracile Skink) అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ZSI) డైరెక్టర్ డాక్టర్ ధ్రితి బెనర్జీ శుక్రవారం ప్రకటించారు.

ఇక ఈ అరుదైన జాతి ప్రస్తుతం కేవలం రెండు ప్రాంతాల్లోనే కనిపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. శేషాచలంతో పాటు తెలంగాణలోని అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలో కూడా కనిపిస్తోందన్నారు. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, ఇది భారత జీవవైవిధ్యంలో అరుదైన మణికట్టు వంటి గుర్తింపుగా నిలిచింది. అలాగే 'ఇది భారతదేశంలోని పరిరక్షిత అడవుల్లో ఇప్పటికీ అన్వేషించాల్సిన ఎన్నో రహస్యాలు ఉన్నాయని సూచిస్తోంది' అని బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇక ఈ పరిశోధనలో జడ్‌ఎస్‌ఐ హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రం, కోల్‌కతా రెప్టిలియా విభాగం, లండన్ నేచురల్‌ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. డాక్టర్ దీపా జైస్వాల్‌ ప్రకారం, ఈ అధ్యయనం శేషాచలం వంటి బయోలాజికల్‌ హాట్‌స్పాట్‌ల పరిరక్షణ అవసరాన్ని మరింతగా హైలైట్ చేస్తోంది. ఈ కొత్త జాతి కనుగొనడం శాస్త్రీయ ప్రపంచానికి మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

Next Story