ఆర్టీసీ జేఏసీ రెండో విడత ఉద్యమ వేళ కీలక పరిణామం..రేపు చర్చలు

by Vemula.Srinu Prasad |

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన నోటీసుపై తొలి విడత ఆందోళన కార్యక్రమాలు పూర్తికాగా, రెండో విడతలో భాగంగా జూలై 7, 8 తేదీల నుంచి 'ఆర్టీసీ పరిరక్షణ దినం' పేరుతో డిమాండ్ బ్యాడ్జీలు ధరించి ప్రజల్లోకి డిమాండ్లను తీసుకెళ్లే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జేఏసీ ప్రకటించింది..

ఆర్టీసీ జేఏసీ రెండో విడత ఉద్యమ వేళ కీలక పరిణామం..రేపు చర్చలు
X

దిశ‌, ఏపీ బ్యూరో: ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన నోటీసుపై తొలి విడత ఆందోళన కార్యక్రమాలు పూర్తికాగా, రెండో విడతలో భాగంగా జూలై 7, 8 తేదీల నుంచి 'ఆర్టీసీ పరిరక్షణ దినం' పేరుతో డిమాండ్ బ్యాడ్జీలు ధరించి ప్రజల్లోకి డిమాండ్లను తీసుకెళ్లే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జేఏసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఆర్టీసీ హౌస్‌లో యాజమాన్యంతో జరిగే చర్చలకు హాజరుకానుంది.

సోమవారం జరిగే చర్చల్లో టీఆర్‌అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, ఆర్టీసీ వీసీ అండ్‌ ఎండీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంతో పాటు ఉన్నతాధికారులు పాల్గొననున్న నేపథ్యంలో ఆదివారం ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా జేఏసి కన్వీనర్లు, కో-కన్వీనర్ల సమీక్ష సమావేశం నిర్వహించినట్లు జేఏసి కన్వీనర్లు వై. శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు తెలిపారు.

చర్చల్లో ఆర్టీసీని బలోపేతం చేసే చర్యలు, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని విరమించి ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారానే విద్యుత్ బస్సుల నిర్వహణ, 'స్త్రీ శక్తి' వంటి సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన మేర బస్సుల పెంపు, ఖాళీ పోస్టుల భర్తీ ద్వారా ఉద్యోగులపై పనిభారం తగ్గించడం, అలాగే మెమోరాండంలో పొందుపరిచిన సుమారు 30 డిమాండ్లపై చర్చించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ సమీక్ష సమావేశంలో కో-కన్వీనర్లు పి.వి. రమణారెడ్డి, జి.వి. నరసయ్య, సి.హెచ్. సుందరయ్య, కట్టా సుబ్రహ్మణ్యం, ఎస్.వి. శేషగిరిరావు, వై. శ్రీనివాసరావు, కే. సూర్యప్రకాశరావు, డి. మాల్యాద్రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story