తక్కువ ధరకే బంగారమంటూ భారీ మోసం.. తణుకులో తీవ్ర కలకలం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-09 09:19:11  IST  )

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అధిక వడ్డీ , తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ జరిగిన భారీ మోసం కలకలం రేపుతోంది. స్థానిక మహిళ స్నేహలత, అంజూరి దుర్గ ప్రసాద్‌తో కలిసి సుమారు 30 మంది మహిళలను నమ్మించి, వారి నుండి ఏకంగా రూ. 30 కోట్లు వసూలు చేశారు..

తక్కువ ధరకే బంగారమంటూ భారీ మోసం.. తణుకులో తీవ్ర కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District) తణుకులో అధిక వడ్డీ, తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామంటూ జరిగిన భారీ మోసం కలకలం రేపుతోంది. స్థానిక మహిళ స్నేహలత, అంజూరి దుర్గ ప్రసాద్‌తో కలిసి సుమారు 30 మంది మహిళలను నమ్మించి, వారి నుండి ఏకంగా రూ. 30 కోట్లు వసూలు చేశారు. 2023లో ఒక్కో బాధితురాలు సుమారు రూ. 40 లక్షల నుండి 50 లక్షల వరకు వీరికి అప్పగించారు. తొలుత పది రోజులకే వడ్డీ చెల్లించి అందరి నమ్మకాన్ని గెలుచుకున్న ఈ కిలాడీలు, ఆ తర్వాత అసలుకే ఎసరు పెట్టి ముఖం చాటేశారు.

తీవ్ర సంచలనంగా ఫోన్ కాల్ రికార్డింగ్

ఈ వ్యవహారంలో స్నేహలతకు సంబంధించిన ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. "నన్ను మీడియా కానీ, పోలీసులు కానీ ఏమీ చేయలేరు" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బాధితులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమ డబ్బు తిరిగి రాదని, తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండదండలు ఉన్నాయనే ధీమాతోనే నిందితులు ఇలా విర్రవీగుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

సొమ్మంతా మాయం

కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మంతా మాయం కావడంతో బాధితులు రోడ్డున పడ్డారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ సొమ్ము తమకు తిరిగి ఇప్పించాలని వారు వేడుకుంటున్నారు. సామాన్య మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇంత పెద్ద ఎత్తున మోసం జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Next Story