భీమిలి బీచ్ లో హృదయ విదారక దృశ్యం!

by Thanuru Gopichand |

విశాఖపట్నం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం భీమిలి బీచ్‌లో (Bhimili Beach) హృదయ విదారక దృశ్యం కనిపించింది.

భీమిలి బీచ్ లో హృదయ విదారక దృశ్యం!
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం భీమిలి బీచ్‌లో (Bhimili Beach) హృదయ విదారక దృశ్యం కనిపించింది. సముద్ర జీవుల మృత్యుఘోష స్థానికులను, పర్యావరణవేత్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓ డాల్ఫిన్ Dolphin), సముద్రపు తాబేలు కళేబరాలను స్థానిక మత్స్యకారులు గుర్తించి అటవీ, మత్స్య శాఖ అధికారులకు సమాచారం అందించారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు తరచుగా జరగడం, ముఖ్యంగా అరుదైన ఆలివ్ రిడ్లే (Olive Ridley) వంటి సముద్రపు తాబేళ్ల మరణాలు పెరిగిపోవడం ఆందోళనకరంగా మారింది. గుడ్లు పెట్టడానికి వేల కిలోమీటర్లు ప్రయాణించి తీరానికి వచ్చే ఈ జీవులు, మత్స్యకారుల మరబోట్ల పంకాలకు తగిలి, నిషేధిత వలల్లో చిక్కుకొని మృత్యువాత పడుతున్నట్లు అధికారులు, పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

​సముద్ర జీవుల మరణాలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితి పర్యావరణ సమతుల్యానికి పెనుముప్పుగా పరిణమిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నివేదికల ప్రకారం ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి మార్చి మధ్య కాలంలో ఈ తాబేళ్లు గుడ్లు పెట్టడానికి తీరానికి వస్తాయి. సరిగ్గా ఇదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా తీరానికి సమీపంలో చేపల వేట సాగించడం, శక్తివంతమైన ఇంజన్ బోట్లు వినియోగించడం వంటివి జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా సముద్రంలోకి కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు, ప్లాస్టిక్ కాలుష్యం కూడా వీటి మనుగడకు ప్రమాదకరంగా మారుతున్నట్లు తెలియవస్తోంది. తాబేళ్లు సముద్రంలో జెల్లీఫిష్‌లను నియంత్రిస్తూ మత్స్య సంపద వృద్ధికి కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సముద్ర జీవుల సంరక్షణకు ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయడంతో పాటు మత్స్యకారులకు అవగాహన కల్పించడం అత్యవసరమని పర్యావరణహితులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషాదకర సంఘటనలపై అధికారులు వెంటనే స్పందించి, మరణాలకు గల అసలు కారణాలను గుర్తించి, సముద్ర జీవుల సంరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

Next Story