- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరణ్యాల్లో అగ్నికీలలు.. దావానలంలో మూగజీవాల ఆర్తనాదాలు
పక్షుల కిలకిలారావాలతో, లేళ్ళ తుళ్ళింతలతో కళకళలాడాల్సిన ఆ పచ్చని ఒడి, నేడు మరుభూమిగా మారుతోంది.

దిశ ప్రతినిధి , రాజంపేట : పక్షుల కిలకిలారావాలతో, లేళ్ళ తుళ్ళింతలతో కళకళలాడాల్సిన ఆ పచ్చని ఒడి, నేడు మరుభూమిగా మారుతోంది. మీరు చూస్తున్న ఆ మంటలు కేవలం ఎండుటాకులను కాల్చడం లేదు, నోరులేని వేల జీవరాశుల ఊపిరిని ఆపేస్తున్నాయి. ఎవరో ఒక వ్యక్తి తన 'పైశాచిక ఆనందం' కోసం రాజేసిన ఒక చిన్న నిప్పురవ్వ, వేసవిలో అడవి తల్లి గుండెకు చిచ్చు పెడుతోంది.
వన్యప్రాణుల ఆర్తనాదాలు ఎవరికి వినిపిస్తాయి?
మంటలు అలుముకుంటుంటే అడవిలో వినిపించే శబ్దాలు హృదయవిదారకం. ఆకాశంలోకి ఎగిరి ప్రాణాలు కాపాడుకోగల శక్తి తల్లి పక్షులకు ఉంది. కానీ, గూళ్ళలో ఉన్న రెక్కలు రాని పసి పిల్లలు? ఆ వేడికి గూటిలోనే మాడిపోతుంటే, ఆ తల్లి పక్షులు చేసే హాహాకారాలు అరణ్యం దాటి రావడం లేదు.
నేలమ్మ బిడ్డలు: మంటల వేగానికి పరుగెత్తలేని తాబేళ్లు, పొదల్లో దాక్కునే కుందేళ్లు, నేల మీద ప్రాకే పాములు సజీవ దహనమవుతున్నాయి. ఆ మంటల నుంచి తప్పించుకోవడానికి అవి చేసే ప్రయత్నం, చివరకు బూడిద కుప్పల కింద అంతమై పోతున్నాయి. వేసవి ఎండలకు తోడు ఈ అగ్ని కీలలు తోడవ్వడంతో, నీటి కోసం వెతుకులాడే వన్యప్రాణులు దిక్కుతోచని స్థితిలో మంటల మధ్య చిక్కుకుంటున్నాయి. కోడూరు, రాయచోటి, బద్వేల్, మైదుకూరు, పోరుమామిళ్ల, వేంపల్లి, పులివెందుల, జమ్మలమడుగు ఇలా జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న అడవులు నేడు అగ్నిప్రమాదాల ముప్పులో ఉన్నాయి.
లంకమల విషాదం: ప్రపంచంలోనే అత్యంత అరుదైన కలివికోడి నివాసం లంకమల అడవుల్లో ఉంది. మనం పెట్టే మంటలు ఈ జాతిని భూమి మీద లేకుండా చేసేస్తున్నాయి.
ప్రమాదంలో జీవవైవిధ్యం
ఎలుగుబంట్లు, చిరుతలు, నెమళ్లు, అరుదైన వనమూలికలు ఈ అగ్నికి ఆహుతవుతున్నాయి. అడవి అంతరిస్తే, రేపు మనకు అందే ఆక్సిజన్ కూడా అంతరిస్తుందని మనిషి మరచి పోతున్నాడు.
అటవీశాఖ అప్రమత్తం కావాలి
కేవలం ఫైర్ లైన్లు గీయడం, నివేదికలు ఇవ్వడం వల్ల అడవికి పొంచి ఉన్న ప్రమాదం ఆగదు.
అడవికి నిప్పు పెట్టే వ్యక్తులపై రాజీ లేని చర్యలు తీసుకోవాలి. వారిని సమాజ ద్రోహులుగా పరిగణించాలి.
సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా లేదా వాచ్ టవర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉండాలి.
ప్రజల్లో మార్పు: అడవి మనది, అందులోని జీవాలు మన తోటి ప్రాణులు అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలి.
మంటల్లో కాలిపోతున్న పక్షి పిల్లల ఆర్తనాదాలు మనకు వినిపించకపోవచ్చు.. కానీ ఆ పాపం ఆ దారుణం అడవులకు నిప్పుపెట్టే వారికి ప్రకృతి శాపంగా భావించాలి. అడవిని రక్షించడం అంటే ఒక చెట్టును నాటడం కాదు, ఉన్న చెట్టును, దాని నీడన బతికే ప్రాణాన్ని నిలబెట్టడం అనే ప్రకృతి ధర్మాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించడం ద్వారా అడవులు మానవ మనుగడకు, జీవరాశికి ప్రాణ వాయువు అవుతుంది.






