- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉమ్మడి కుటుంబానికి నిలువెత్తు నిదర్శనం.. ఒకే ఇంట్లో 83 మంది సభ్యులు
మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి అంటారు. కానీ ఆ మార్పు మంచికంటే చెడునే ఎక్కువ అయ్యేలా చేస్తుంది.

దిశ, వెబ్‌డెస్క్: మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి అంటారు. కానీ ఆ మార్పు మంచికంటే చెడునే ఎక్కువ అయ్యేలా చేస్తుంది. కొత్తగా పెళ్లైన జంట అత్తామామలతో కలిసుండటం సంగతి పక్కనపెడితే.. కనీసం భార్య భర్తలే ఒక ఇంట్లో కలిసుండటం కనాకష్టమవుతున్న రోజులు. భాగస్వామి బయటికెళ్లడం ఆలస్యం.. అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ.. అడ్డొస్తున్నారని అంతమొందిస్తున్న రోజులివి. ఈ కాలంలో ఓ కుటుంబంలో ఆరు తరాలవారు ఒకే ఇంటిలో ఉంటున్నారు. గదులు వేరైనా.. వారందరి వంటిల్లు ఒక్కటే. ఆడవాళ్ల మధ్య గొడవల్ని వరలో కత్తులతో పోలుస్తూ సామెత చెప్తారు. కానీ.. ఈ కుటుంబంలో ఆడవాళ్ల మధ్య గొడవలు వచ్చినా.. తమలో తాము సర్దుకుంటారని కుటుంబ పెద్ద చెప్తున్నారు. ఉదయం గొడవైతే.. సాయంత్రానికి మళ్లీ కలిసిపోతారంటున్నారు. పిల్లలు సైతం తమ మాటను జవదాటరని, అందుకే 83 మందిమీ ఒకే ఇంటిలో ఉండగలుగుతున్నామన్నారు. ఆ ఇంట్లో ఆరుగురు అత్తలు, 14 మంది కోడళ్లు, 20 మంది పిల్లలు, మిగతా పెద్దలంతా కలిసి ఉంటున్నారు. ఇదంతా చదువుతుంటే "కుటుంబం.. అన్నగారి కుటుంబం" అనే పాట గుర్తొస్తుంది కదూ. అందులో బాలకృష్ణ కుటుంబానికి ఈ కుటుంబానికి పొంతన లేకున్నా.. ఆ పాటమాత్రం బాగా సెట్ అవుతుంది సుమీ.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లికి చెందిన హనుమంతరాయుడు, ముత్యాలప్ప ల ఉమ్మడి కుటుంబం కథ ఇది. వీరిద్దరూ బావ, బావమరుదులు. నలుగురైదుగురు ఇంట్లో ఉంటేనే పనులకు వంతులేసుకుంటుంటారు. కానీ ఈ ఫ్యామిలీ అలా కాదు. పొద్దున కాఫీ తాగేందుకు కూర్చున్నపుడే ఆ రోజు ఎవరెవరు ఏ పని చేయాలో ప్రణాళికలు వేసుకుంటారు. ఏ వంట చేయాలో కూడా డిసైడ్ అవుతారు. పొలం ఎవరెళ్లాలి, మిగతా పనులు ఎవరు చూసుకోవాలన్న విషయాలు ఇద్దరు ఇంటిపెద్దలు ఆదేశిస్తారు. అలా మిగతా వారంతా వారి మాటే వేదంగా.. పనులు పూర్తిచేస్తారు. కోడళ్లలో కొందరు ఇంటిపనులు, మరికొందరు పొలం పనులు చూసుకుంటారు. వారిలో వారికి ఉండేందుకు ఆ ఇల్లు చక్కగా సరిపోతుందంటున్నారు.
ఈ ఆదర్శ కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. 5 చోట్ల 120 ఎకరాల భూమి ఉంది. వాటిలోనే వాణిజ్య పంటలు, కూరగాయలు, ధాన్యం.. అన్ని రకాల పంటలూ సాగుచేస్తుంటారు. కొంతభాగం పంటను ఏడాది పొడవునా తినేందుకు భద్రపరుచుకుని, మిగతా పంటను అమ్ముకుంటారు. ఎప్పుడూ వ్యవసాయంలో నష్టాలు చూడలేదని చెప్తున్నారు. ఈ కుటుంబానికి నాలుగు ట్రావెల్ బస్సులు కూడా ఉన్నాయి. కల్యాణదుర్గం నుంచి కర్ణాటకకు రూట్ బస్సులు, ట్రావెల్ బస్సులుగా నడుపుతున్నారు. ఇలాంటి కుటుంబం నేటి జనరేషన్ కు నిజంగానే మంచి నిదర్శనమని చెప్పాలి.






