ఆంధ్రప్రదేశ్‌లో పదోన్నతుల్లో సాంకేతిక విప్లవం: 4,851 మందికి ప్రమోషన్లు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-07 20:45:32  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సాంకేతికతతో పారదర్శకంగా నిర్వహిస్తోంది. మానవ ప్రమేయం లేకుండా, సర్వీసును మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఆన్‌లైన్ విధానంలో ఈ ప్రక్రియ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో పదోన్నతుల్లో సాంకేతిక విప్లవం: 4,851 మందికి ప్రమోషన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సాంకేతికతతో పారదర్శకంగా నిర్వహిస్తోంది. మానవ ప్రమేయం లేకుండా, సర్వీసును మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఆన్‌లైన్ విధానంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. ఈ విధానంపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నవారిని నమ్మవద్దని, పైరవీలు, రాజకీయ జోక్యానికి ఎలాంటి ఆస్కారం లేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా, రాజకీయ జోక్యం లేకుండా ఆన్‌లైన్ ద్వారా 4,853 పదోన్నతులు, 35,235 బదిలీలు విజయవంతంగా పూర్తయ్యాయని విద్యాశాఖ వెల్లడించింది. ఉపాధ్యాయ సంఘాలతో చర్చల ద్వారా సూచనలు స్వీకరించి, "టీచర్ ట్రాన్స్‌ఫర్స్ యాక్ట్"ను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం, అన్ని బదిలీలను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తోంది.

2025 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల సౌలభ్యం కోసం కొత్త సాంకేతిక సౌకర్యాలు ప్రవేశపెట్టారు. మండల కేంద్రం నుంచి పాఠశాల దూరం, ఖాళీల వివరాలు స్పష్టంగా చూపడంతోపాటు, ఆప్షన్ల మార్పిడి, అవగాహన వీడియోలు, సాంకేతిక సందేహాల నివృత్తికి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తప్పనిసరి బదిలీల విషయంలో ఆప్షన్లను ఖచ్చితంగా ఖరారు చేయాల్సి ఉంటుంది.

గతంలో మాన్యువల్ కౌన్సెలింగ్‌లో ఖాళీల వివరాలు తెలియకపోవడం, సీనియర్లు నష్టపోవడం, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి వేచి ఉండాల్సిన ఇబ్బందులు ఉండేవి. ఆన్‌లైన్ విధానం ఈ సమస్యలను అధిగమించి, సమయం, శ్రమ ఆదా చేస్తూ, పైరవీలకు అడ్డుకట్ట వేసిందని అధికారులు తెలిపారు. సీనియారిటీకి న్యాయం జరుగుతోందని వారు స్పష్టం చేశారు.

1998లో కౌన్సెలింగ్ విధానం ప్రారంభమైనప్పటికీ, మాన్యువల్ పద్ధతిలో లోపాలు ఉండేవి. 2015లో తొలిసారిగా వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ప్రవేశపెట్టగా.. అది ఉపాధ్యాయులలో నమ్మకాన్ని పెంచింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ విధానాన్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తూ, అపోహలకు తావులేకుండా చేస్తోందని విద్యాశాఖ వెల్లడించింది.

Next Story