South Korea: పెట్టుబడిదారులకు ‘3ఎస్’ విధానం రక్షణ కవచం: మంత్రి లోకేశ్‌

by Ramesh Naini |   (  Updated:2026-07-09 04:42:51  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం అమలు చేస్తున్న 3S (స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) విధానం కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

South Korea: పెట్టుబడిదారులకు ‘3ఎస్’ విధానం రక్షణ కవచం: మంత్రి లోకేశ్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం అమలు చేస్తున్న 3S (స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) విధానం కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఐదో రోజు ఆయన సియోల్‌లో ఆ దేశ రాజకీయ, విదేశీ వ్యవహారాల ఉప మంత్రి యుయ్-హే సిసిలియా చుంగ్‌ (Deputy Minister for Political Affairs and Foreign Affairs Eui-hae Cecilia Chung)తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అందించే పన్ను రాయితీలు, తక్కువ ధరకే భూమి, సబ్సిడీల గురించి వివరిస్తూ.. ఏపీని నమ్మకమైన పారిశ్రామిక కేంద్రంగా మార్చుకునేందుకు కొరియా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కోరారు. ఏపీలో కొరియన్ కల్చరల్ సెంటర్, సంయుక్త శిక్షణా అకాడమీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

ఈవీ రంగాన్ని విస్తరించాలని కియాకు విజ్ఞప్తి

అంతకుముందు కియా మోటార్స్ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కియా ప్రాజెక్టుల విస్తరణపై పలు ప్రతిపాదనలు చేశారు. ఏపీలో ఇంటిగ్రేటెడ్ ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని విస్తరించాలి. విశాఖపట్నం పోర్టు సమీపంలో సీకేడీ (CKD) అసెంబ్లింగ్, ఎక్స్‌పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఈవీ కాంపోనెంట్ల తయారీతో పాటు, ఈవీ పవర్‌ట్రెయిన్ టెస్టింగ్ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలి. మంత్రి ప్రతిపాదనలపై స్పందించిన కియా ప్రతినిధులు.. తమ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అధికార వర్గాల సమాచారం.

Next Story