వైసీపీలో 140 మంది ఎమ్మెల్యేలు అవినీతి తిమింగళాలు: Yanamala Rama Krishnudu

by Seetharam |   (  Updated:2023-08-03 07:06:32  IST  )

సామాజిక న్యాయానికి దోహదపడే బీసీ జనగణనను దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలే చేపడుతుంటుంటే.. జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీ జనగణన చేయకుండా బీసీలకు తీరని ద్రోహం చేస్తోంది.

వైసీపీలో 140 మంది ఎమ్మెల్యేలు అవినీతి తిమింగళాలు: Yanamala Rama Krishnudu
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘సామాజిక న్యాయానికి దోహదపడే బీసీ జనగణనను దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలే చేపడుతుంటుంటే.. జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీ జనగణన చేయకుండా బీసీలకు తీరని ద్రోహం చేస్తోంది’ అని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ‘బీసీలు ఎంతమంది ఉన్నారు..? వారి ఆర్థిక స్థితిగతులేంటి..? దారిద్ర్యరేఖ దిగువన ఉండడానికి గల కారణాలు ఏంటి? సంచార జాతులుగా ఎంతం మంది ఉన్నారు? వారి ఆర్థిక పరిస్థితివంటి సమాచారం బీసీ జనగణన ద్వారానే వస్తోంది. ఈ సమాచారం లేకుండా జగన్ రెడ్డి ఏ విధంగా పాలన సాగిస్తారు?’ అని మండిపడ్డారు.‘రాష్ట్ర ప్రభుత్వం జనగణన చేయవచ్చని పాట్నా హైకోర్టు కూడా చెప్పింది. బీహార్ ప్రభుత్వం కూడా మొదలుపెట్టింది. జగన్ మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారు? బీసీ జనగణనను జగన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. బీసీలంటే జగన్ రెడ్డికి ఎందుకు అంత కక్ష?. బీసీల విషయంలో లెక్కలేనితనం చూపుతున్నజగన్ రెడ్డికి త్వరలో బీసీలే బుద్ధి చెబుతారు. వెంటనే బీసీ జనగణనను మొదలు పెట్టాలి’ అని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

వైసీపీలో 140 అవినీతి తిమింగళాలు

టీడీపీ హయాంలో చట్ట సభల్లో రిజర్వేషన్లు, బీసీ జనగణన వంటి కీలక అంశాలపై అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తే వాటిని ఆమోదించుకునేందుకు కూడా జగన్ రెడ్డి దృష్టిపెట్టకపోవడం దుర్మార్గం అని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అప్పులపై ఉన్న శ్రద్ధ బీసీల సంక్షేమంపై లేదు అని విమర్శించారు. వైసీపీ నుంచి గెలిచిన 151 మందిలో 140 మంది అవినీతి తిమింగళాలే అనే విషయం ఏడీఆర్ నివేదిక ద్వారా బట్టబయలైంది అని ధ్వజమెత్తారు. ‘అధికారాన్ని అడ్డుపెట్టుకుని సహజ వనరులను దోచుకుంటున్నారు. దేశంలో అత్యధిక ధనిక ఎమ్మెల్యేల జాబితా చూస్తే.. వైసీపీ ఎమ్మెల్యేలే మొదటి స్థానంలో ఉన్నారు. అయినకాడికి దోచుకుని రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారు. నేరాలు, ఘోరాలు, లూటీలు, విధ్వంసాలు, విద్వేషాలతో వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేశారు’అని యనమల మండిపడ్డారు.

ప్రజల రక్తాన్ని పీల్చుతున్న వైసీపీ ప్రభుత్వం

ఎన్నికల కమిషన్ దొంగ ఓట్లపై దృష్టిపెట్టిన విధంగానే వైసీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై దృష్టి పెట్టాలి అని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. అవినీతి సొమ్ముతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయకుండా కాపాడాలన్నారు. డబ్బు ప్రభావం లేకుండా పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి అని కోరారు. అత్యంత అణగారిన వర్గం చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంది అని చెప్పుకొచ్చారు. పులివెందుల కూడా తెలుగుదేశం పార్టీదే అనే విషయం చంద్రబాబు నాయుడు బహిరంగసభ ద్వారా బట్టబయలు అయింది అని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి సొంత నియోజకవర్గం, సొంత ఊరిలో కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టడం జగన్ పై ఉన్న వ్యతిరేకతకు అద్దంపడుతోంది అని అన్నారు. జగన్ రెడ్డి సభలకు బలవంతంగా ప్రజలను తరలించిన రావట్లేదు.. కానీ చంద్రబాబు నాయుడు సభలకు స్వచ్ఛందంగా ప్రజలు హాజరై మద్దతు తెలుపుతున్నారు. పేదల సంక్షేమ పథకాలను రద్దు చేసి ప్రజా సంపదను పెత్తందారులకు దోచిపెట్టడం ద్వారే జగన్ సభలకు జనం కరువైనారు. బాదుడే బాధుడుతో తాడేపల్లి ప్యాలెస్ నింపుకునేందుకు ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారు. సీఎం జ‌గ‌న్ ప్రసంగిస్తున్న స‌మయంలోనే స‌భ‌కు హాజ‌రైన వారు మ‌ధ్యలోనే లేచి వెళ్లిపోవటం దేనికి సంకేతం అని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

Next Story