ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఖమ్మం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారులు, సిబ్బంది విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్ కోరారు.

Update: 2024-05-12 10:51 GMT

దిశ, వైరా : ఖమ్మం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారులు, సిబ్బంది విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్ కోరారు. వైరాలోని టీఎస్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో పార్లమెంట్ ఎన్నికల సామగ్రిని ఆదివారం ఎన్నికల అధికారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైరా అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ ఎన్నికల సిబ్బందికి ఈవీఎం బాక్స్ లు, ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి గౌతమ్, జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు.

    ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ పోలింగ్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని కోరారు. నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, ఏన్కూరు, సింగరేణి, జూలూరుపాడు ఐదు మండలాల పరిధిలో గల 252 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని నియమించటం జరిగిందని తెలిపారు. అసెంబ్లీ సెగ్మెంట్లో 23 సెక్టార్లుగా విభజించి పోలింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్ ను నియమించి ప్రత్యేక బస్సుల్లో తరలించినట్టు చెప్పారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ బాక్స్ లను భద్రంగా ఉంచాలని, పోలింగ్ స్టేషన్లోనే సిబ్బంది బస చేయాలని కోరారు. పోలింగ్ శాతం ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు తెలియజేయాలని కోరారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేయడం జరిగిందన్నారు. కలెక్టర్ వెంట అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి సత్యప్రసాద్, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News