సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం

వర్షాకాలం సమీపిస్తున్నందున కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేసి సీతారాం ప్రాజెక్టు ద్వారా ఈ సంవత్సరం లక్షల ఎకరాలకు నీరందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు.

Update: 2024-05-23 10:00 GMT

దిశ, ఏన్కూర్ : వర్షాకాలం సమీపిస్తున్నందున కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేసి సీతారాం ప్రాజెక్టు ద్వారా ఈ సంవత్సరం లక్షల ఎకరాలకు నీరందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. ఏన్కూర్ మండలంలోని సీతారాం ప్రాజెక్టు పనులను గురువారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాసు నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం లక్షల ఎకరాల్లో నీరు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రైతులు భూములు ఇచ్చి నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా ముఖ్యమంత్రితో సంప్రదించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అధికారులతో చర్చించి పనులు వేగవంతం అయ్యే విధంగా చేస్తామని అన్నారు. ప్రభుత్వం తరఫున ప్రతి రైతుకు నష్టపరిహారం

    చెల్లించే విధంగా రైతుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేస్తామని అన్నారు. ఆనాడు రైతుల త్యాగాలతో నాగార్జునసాగర్ నిర్మించినట్లు గుర్తు చేశారు . ఈ సంవత్సరం నాగార్జునసాగర్ నిండనందున పంటలు పెద్దగా పండించుకోలేకపోయినట్లు తెలిపారు. గత సంవత్సరం కృష్ణ నీళ్లు రాలేదని, ఈ ప్రాజెక్టు విషయమై త్వరలో రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని తీసుకువచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. గోదావరి నీళ్లు తీసుకుని వచ్చి సాగర్ కాల్వల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం సస్యశ్యామలమవుతుందని అన్నారు. ఆ పట్టుదలతో ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. జూన్ 4 తర్వాత అధికారులను పిలిచి పనుల విషయమై మాట్లాడతామని అన్నారు.

    ముఖ్యంగా కలెక్టర్ ప్రపోజల్ వస్తేనే ఎకరానికి ఎంత ఇస్తామని చెప్పవచ్చని అన్నారు. సామాన్యులైన మమ్మల్ని గుండెలో పెట్టుకొని గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తమదే కాబట్టి ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించే విధంగా రైతుల తరఫున ముఖ్యమంత్రితో మాట్లాడతానని అన్నారు. అనంతరం భగవాన్ నాయక్ తండా మాజీ సర్పంచ్ గూగుల్ శోభన్ నాయక్ నివాసంలో తేనేటి విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏన్కూర్ మండల అధ్యక్షుడు స్వర్ణ నరేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మేడ ధర్మారావు, కృష్ణ ప్రసాద్, శోభన్ నాయక్ చందులాల్, లెనిన్, ఎండ్రాతి సాయి రోహిత్, మాలోతు నరసింహారావు, జూలూరుపాడు మండల అధ్యక్షుడు మంగీలాల్, మండల నాయకులు, రైతులు, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు.  

Similar News